వైసీపీలో చేరుతున్నా.. జై రమేష్

Update: 2019-02-15 12:54 GMT

తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు వరస దెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత దాసరి జై రమేష్ శుక్రవారం సాయంత్రం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లో జగన్ ను కలసిన ఆయన త్వరలో వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. జగన్ కు మద్దతు పలికేందుకే వచ్చినట్లు వెల్లడించారు. రమేష్ తోపాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరికొంత మంది నేతలు జగన్ తో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ఆదేశిస్తే విజయవాడ ఎంపీ బరిలో ఉంటానని ప్రకటించారు. ఏపీలోని టీడీపీ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యే 50 నుంచి 100 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా సంపాదించుకున్నారని ఆరోపించారు. తన వల్ల టీడీపీ లాభపడింది కానీ..టీడీపీ వల్ల తాను లాభపడింది ఏమీలేదన్నారు.

ప్రస్తుత టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కూడా తాను ఎంతో సాయం చేశానన్నారు రమేష్. దాసరి జై రమేష్‌ దివంగత ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితుడే కాకుండా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. రాబోయే రోజుల్లోనూ వైసీపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ పరిణామాలు ఎన్నికలకు ముందే అధికార టీడీపీలో ఒక రకమైన ఆందోళనను నింపుతున్నాయి. ఏపీ రాజకీయం వచ్చే రోజుల్లో మరింత హాట్ హాట్ గా మారటం ఖాయంగా కన్పిస్తోంది.అమరావతి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. తెలుగు జాతిని అవమానించేలా చంద్రబాబు పాలన సాగుతుందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పాలనలో సాగుతున్నంత అవినీతి తన జీవితంలో ఎన్నడూ చూడలేదని జై రమేష్ ఆరోపించారు. ఈ విధంగా దోచుకునే వాళ్ళు ప్రజలకు ఏమి చేస్తారని ప్రశ్నించారు.

 

 

Similar News