ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

Update: 2019-01-02 14:56 GMT

ప్రధాని నరేంద్రమోడీ ఈ సారి నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం కుంభకోణాలమయంగా మారిందని ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయని ప్రశ్నించారు. తెలంగాణ లో జరిగిన తరహాలోనే ఏపీ ఎన్నికల్లోనూ చంద్రబాబుకు ఓటమి ఖాయమన్నారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బిజెపి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సమయంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నిత్యం అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని ప్రధాని మోడీ అన్నారు. ఏపీకి కేటాయించినన్ని సంస్ధలు దేశ చర్రితలో ఏ రాష్ట్రానికీ దక్కలేదని చెప్పారు. జాతీయ ప్రాదాన్యత ఉన్న పది విద్యాసంస్ధల్ని ఏపీలో ప్రారంభించామని చెప్పారు.

ఏపీ సమగ్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడిందన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్ధాపించారని, ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను చంద్రబాబు కాలరాస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలను టీడీపీ తమ ఘనతగా చెప్పుకుంటోందని, టీడీపీ దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. అవినీతి రహిత భారత్‌కు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను యువతలోకి తీసుకువెళ్లి చైతన్యపరచాలని కార్యకర్తలకు సూచించారు. ఏపీలో ప్రభుత్వం ఏమైనా చేసి ఉంటే అదే చెప్పేదన్నారు. యువత వ్యతిరేక ప్రచారాన్ని నమ్మదని చెప్పారు. విభజనపై అందరూ రాజకీయం చేస్తే రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడిన ఏకైక పార్టీ బిజెపినే అన్నారు.

 

 

 

Similar News