తెలంగాణ కాంగ్రెస్ లో టిక్కెట్ల కలకలం మొదలైంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీటుకే ఎసరు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ సీటును టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పొన్నాల బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరహా ప్రచారం పార్టీకి మంచి సంకేతాలు ఇవ్వదని హెచ్చరించారు. అవసరం అయితే అధిష్టానం ముందు తన వాదన విన్పిస్తానని అన్నారు. మరో వైపు నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ సీటును చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటానని హెచ్చరిస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిరుమర్తి లింగయ్యకు సీటు ఇవ్వకపోతే జిల్లాలో జానారెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఓటమి పాలవుతారని హెచ్చరించారు. ఈ వ్యవహారం పార్టీని చిక్కుల్లోకి నెడుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం నిర్ణయంపై అలక వహించారు. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని రేవంత్ రెడ్డి అసహనంతో ఉన్నారు.
తన అనుచరులకు టికెట్లు దక్కపోతే తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటానని హైకమాండ్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తనతో పాటు పార్టీలో చేరిన నాయకులకు ఖచ్చితంగా సీట్టు కేటాయించాల్సిందే అని కోరుతున్నారు. ఆ జాబితా ఇలా ఉంది. 1.వరంగల్ వెస్ట్ (నరేందర్ రెడ్డి) 2. నిజామాబాద్ రూరల్ (అరికెల నర్సారెడ్డి) 3. ఆర్మూరు (రాజారామ్ యాదవ్) 4. ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి) 5. దేవరకొండ (బిల్యా నాయక్) 6. ఇల్లందు (హరిప్రియ) 7. సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి) 8. చెన్నూరు (బోడ జనార్దన్). కొంత మంది నేతలు ఈ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు వేలెత్తి చూపుతున్నారు. జాబితా పూర్తిగా వెలువడిన తర్వాత ఎన్ని వివాదాలు తలెత్తుతాయో వేచిచూడాల్సిందే. టీజెఎస్ కు కేటాయించిన సీట్లపైనా కొంత మంది నేతలు గాంధీభవన్ వేదికగానే ఆందోళనలకు దిగారు.