తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ మరో కొత్త హామీ ఇచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన తరహాలోనే తాము అధికారంలోకి వస్తే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60కి పెంచుతామని తెలిపారు. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. తాము అధికారంలోకి వస్తామని..ఐఆర్ , పీఆర్ సీ అన్ని విషయాల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో కెసీఆర్ ఈ ప్రకటన చేయటం విశేషం. మహబూబ్ నగర్ లో జరిగిన ప్రచార సభలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ను గెలిపించాలని కోరుతూ కెసీఆర్ ఈ హామీలు ఇచ్చారు. ప్రధాని మోడీకి భయపడటానికి నేను ఏమైనా చంద్రబాబునాయుడినా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే చంద్రబాబు, మోడీ కలసి ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేశారని ఆరోపించారు. తెలంగాణలో కరెంట్ బాధ ఉందని ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఇంత తప్పుడు మాటలు మాట్లాడొచ్చా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో కరెంట్, నీళ్ల సమస్య ఉందని నిరూపించాలని మోదీకి సవాల్ విసిరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఇంతకుముందు సవాల్ విసిరితే పారిపోయారని ఎద్దేవా చేశారు.
‘గ్రహచారం బాలేక మోదీ మనతో పెట్టుకున్నారు. ఇంత తెలితక్కువ ప్రధాని అనుకోలేదు. నిజామాబాద్‌లో నీళ్లు, కరెంట్ సమస్య ఉందని మోదీ అన్నారు. హెలికాప్టర్ ఎక్కి మహబూబ్‌నగర్ నుంచి నేరుగా నిజామాబాద్‌కే వస్తా. దమ్ముంటే నిజానిజాలేంటో నిజామాబాద్‌లోనే తేల్చుకుందాం. ఎవరేంటో ప్రజలే తేలుస్తారు. తెలంగాణలో కరెంట్ సమస్య ఉందని మోదీ అబద్ధలాడారు. ప్రధానమంత్రి తప్పుడు మాటలు మాట్లాడొచ్చునా? ఇంత అల్పంగా మాట్లాడొచ్చునా? మాట్లాడతారు ఎందుకంటే రాజకీయం. అంత దరిద్రపుగొట్టు రాజకీయం. అంత దిక్కుమాలిన రాజకీయం ఉంది. తెలంగాణలో విద్యుత్ సమస్య లేదు. బాధ్యతాయుతమైన ప్రధాన మంత్రి పదవిలో ఉండి ఓట్ల కోసం అబద్దాలు చెప్పడం సరికాదు. ముఖ్యమంత్రిపై నిరాధార ఆరోపణలు చేయడం భావ్యం కాదు. నాకేం భయం లేదు. నాదంతా తెరిచిన పుస్తకం. కాబట్టి నేనేవరికీ భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మజ్లిస్ పార్టీ తమ మిత్రపక్షమని స్పష్టం చేశారు. తమ రెండు పార్టీలు పక్కా తెలంగాణ పార్టీలని అన్నారు. . కాంగ్రెస్‌కు గెలిచే సత్తా లేక చంద్రబాబును భుజాలపై మోసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యర్థులను ఓడిస్తే తనకు సంతోషం కలగదని, డిపాజిట్ రాకుండా చేయాలని ఓటర్లను కోరారు.