‘అమరావతి’లో భూములు కొన్న వారే ‘ఐటి టార్గెట్’!

Update: 2018-10-05 09:22 GMT

ఐటి శాఖ ‘టార్గెట్ క్లియర్’. రాజధాని అమరావతి పేరుతో సాగిన ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’పై ఫోకస్. రాజధాని అయినా..కీలక పరిశ్రమలు అయినా ఎక్కడ వస్తాయో ముందు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే తెలుస్తాయి. వాటిని ఆసరా చేసుకుని ప్రభుత్వ పెద్దల బినామీలు..సన్నిహితులకు ‘ఉప్పందిస్తారు’. ఆ సమయంలో వీరు లావాదేవీలు చేసుకుంటారు. తర్వాత రాజధాని..పరిశ్రమల ప్రకటన వస్తుంది. అంతే ఆ భూముల ధరలకు రెక్కలొస్తాయి. కొనుగోలు చేసిన వారికి కోట్లాది రూపాయల లాభాలు వస్తాయి. అచ్చం ‘అమరావతి’లో అదే జరిగింది. ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న వారితో పాటు రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారు సైతం భారీ ఎత్తున రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు.

ఇందులో బినామీల లెక్కకు అంతే లేదు. ఆయా రాజ్యాంగ పదవులు...కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల ఆదాయాలు...కొనుగోలు చేసిన భూముల విలవల మధ్య ‘లెక్క’ కుదరటం లేదు. ఐటి శాఖ ఇప్పుడు ఆ ‘లెక్కలు’ తేల్చేపనిలో ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శుక్రవారం నాడు ఏపీలో మొదలైన ఈ ఐటి ప్రకంపనలు ఇప్పట్లో ఆగే అవకాశం లేదని సమాచారం. ఎందుకంటే అక్కడ జరిగిన లావాదేవీలు అలా ఉన్నాయి మరి. దీనికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఐటి అధికారులు రంగంలోకి దిగారని చెబుతున్నారు. ఈ వ్యవహారంతో చాలా పెద్ద చేపల అక్రమ దందాలు..రాజధాని పేరు చెప్పి దోచుకున్న వ్యవహారాలు వెలుగు చూడటం ఖాయం అని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Similar News