‘పన్ను’తో పరువు పొగొట్టుకున్న యనమల..డబ్బు వాపస్

Update: 2018-09-28 10:05 GMT

పంటికి రూట్ కెనాల్. ఎంత పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో చేయించుకున్నా పాతిక వేలకు మించదు. కానీ ఏపీలో అత్యంత సీనియర్ మంత్రి, రాజకీయ నాయకుడు అయిన యనమల రామకృష్ణుడు ఈ రూట్ కెనాల్ చికిత్సకు సింగపూర్ లో వైద్యం చేయించుకుని ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులో నుంచి 2.80 లక్షల రూపాయలు క్లెయిం చేశారు. కొన్ని ప్రధాన పత్రికలు అయితే అసలు ఈ వార్తే రాయకుండా యనమలకు సంఘీభావం ప్రకటించాయి. కొన్ని పత్రికలతో పాటు..సోషల్ మీడియాలో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. చివరకు ప్రతిపక్ష వైసీపీ, బిజెపి నేతలు కూడా యనమల రామకృష్ణుడి పంటి చికిత్స వ్యవహారంపై విమర్శలు చేశారు. ఓ మంత్రిగా విదేశాల్లో వైద్యం చేయించుకోవటానికి ఆయనకు అర్హత ఉన్నా...పంటి రూట్ కెనాల్ కు అయిన బిల్లు చూసే అందరూ అవాక్కు అయ్యారు. ఓ పెద్ద స్కామ్ చేసే నష్టం కంటే ఈ చిన్న జీవోతోనే యనమల తన పరువు పొగొట్టుకున్నారు.

దీంతో ఇప్పుడు సింగపూర్ లో చేయించుకున్న పంటి చికిత్సకు సంబంధించిన డబ్బును తిరిగి ఖజనాకు చెల్లించేశారు. దీంతో యనమల పంటి చికిత్సకు అయిన మొత్తం జారీ చేస్తూ విడుదలైన జీవో 1844 రద్దు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. పంటి చికిత్స కోసం యనయల తీసుకున్న 2,88,823 రూపాయలను చలానా రూపంలో జమ చేశారని జీవోలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే యనమల రామకృష్ణుడికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయినా పంటి చికిత్స నిమిత్తం సర్కారు నుంచి తీసుకున్న మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసి కొంతలో కొంత పరువు కాపాడుకునే ప్రయత్నం చేశారు.

 

 

 

 

Similar News