వైసీపీలోకి మాజీ మంత్రి

Update: 2018-09-02 12:09 GMT

నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఆయనకు అధికార పార్టీలో సముచిత ప్రాధాన్యత దక్కలేదు. పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఫలితం లేకపోవటంతో ఆనం రామనారాయణరెడ్డి పలు తర్జనభర్జనల తర్వాత ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలో చేరారు. ఆనం రామనారాయణరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరింత ఊపు వచ్చినట్లు అయింది. విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్న జగన్ వద్దకు వచ్చిన ఆయన అక్కడే తన అనుచరులతో కలసి వైసీపీలో చేరారు. వీరికి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ జండాలు కప్పి స్వాగతించారు.

వైసీపీలో చేరిక సందర్భంగా ఆనం మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలను టీడీపీ, బీజేపీ దారుణంగా మోసం చేశాయని దుయ్యబట్టారు. నాలుగేళ్ళకుపైగా కలిసి కాపురం చేసి ఇప్పుడు కొత్త నాటకానికి తెర తీశాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే విడిపోయినట్టు డ్రామాలాడుతున్నాయన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రమాణం చేసి ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పారని మండిపడ్డారు.

 

 

Similar News