మూడు నుంచి ఏడుకు పడిపోయిన ఏపీ ర్యాంక్
ఎనిమిదవ ప్లేస్ లో తెలంగాణ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో నెంబర్ వన్ ప్లేస్ దక్కిందని పత్రికల నిండా ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి...టీవీల్లో ప్రచారం హోరెత్తిస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇది షాక్ లాంటి వార్తే. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ అండ్ ఎకనమిక్ రిసెర్చ్ (ఎన్ సీఏఈఆర్) తాజా నివేదికలో ఏపీ ర్యాంక్ మూడు నుంచి ఏడుకు పడిపోయింది. వివిధ అంశాల ఆధారంగా దేశంలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రాలను గుర్తించి ఈ ర్యాంకింగ్స్ ఇఛ్చారు. ఈవోడీబీ ర్యాంకింగ్స్ విషయంలో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న ఏపీ, తెలంగాణలు ఎన్ సీఏఈఆర్ జాబితాలో మాత్రం ఏడు, ఎనిమిదవ స్థానాల్లో సర్దుకుపోవాల్సి రావటం విశేషం. 2017లో దేశంలోనే ఏపీ మూడవ ర్యాంక్ లో ఉండగా...ఇప్పుడు ఏపీ ర్యాంక్ ఈ జాబితాలో 7కి పడిపోయింది. అంటే ఈవోడీబీ లెక్కలకు...ఎన్ సీఏఈఆర్ వాస్తవ పరిస్థితికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో అర్థం అవుతుంది. రాష్ట్ర పెట్టుబడి పొటెన్షియల్ ఇండెక్స్ (ఎన్-ఎస్ఐపిఐ) పేరుతో తాజాగా ఎన్ సీఏఈఆర్ ఈ జాబితాను విడుదల చేసింది.
భూమి, కార్మికులు, మౌలికసదుపాయాలు, ఆర్థిక వాతావరణం, రాజకీయ స్థిరత్వం, పరిపాలన వంటి కీలక అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఈ సర్వే ప్రభావం పారిశ్రామిక రంగంపై ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా..తమిళనాడు తన పరిస్థితిని మెరుగుపర్చుకుని రెండవ స్థానానికి చేరుకుంది. ఏపీ పరిస్థితి మూడు నుంచి ఏడుకు దిగజారింది. ఈ జాబితాలో గుజరాత్ మూడవ ప్లేస్ కు చేరింది. మహారాష్ట్ర ఐదవ ప్లేస్ లో, కేరళ ఆరు, ఏపీ ఏడు, తెలంగాణ ఎనిమిదవ ప్లేస్ లో ఉన్నాయి. కర్ణాటక తొమ్మిదవ ప్లేస్ లో, పశ్చిమ బెంగాల్ పదవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చాయి. పారిశ్రామికవేత్తల అభిప్రాయాల పరంగా చూస్తే ఏపీ, తెలంగాణల పరిస్థితి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. భూమి పొందే/అందుబాటు జాబితాలో తెలంగాణలో పరిస్థితి అనుకూలంగానే ఉందని ఈ నివేదిక చెబుతోంది.