కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు

Update: 2018-07-09 05:44 GMT

సినీ క్రిటిక్, నిత్యం తన వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కత్తి మహేష్ పై హైదరాబాద్ నగర బహిష్కరణ వేటు పడింది. తెలంగాణ పోలీసులు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఓ ఛానల్ లో నిర్వహించిన చర్చలో కత్తి మహేష్ శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అంతే కాదు..పలు చోట్ల కేసులు కూడా నమోదు అయ్యాయి. కత్తి మహేష్ వ్యాఖ్యలకు నిరసనగా పలువురు స్వామిజీలు నిరసన యాత్రలకు దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ యాత్రలకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు.

తెలంగాణ రాష్ట్రంలో తమకు రాజకీయ పార్టీలతో కానీ.. సంఘాలతో కానీ ఎలాంటి సమస్యలు రావటం లేదని..తమకు ఈ కత్తి మహేష్ పెద్ద సమస్యగా మారాడని కొద్ది రోజుల క్రితం పోలీసులు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానించారు. అంతే కాదు..త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మీడియాకు తెలిపారు. అందుకు అనుగుణంగా కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు వేసి..అనుమతి లేకుండా నగరంలోకి ప్రవేశించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ పోలీసులకు కత్తి మహేష్ ను అప్పగించినట్లు సమాచారం. శాంతి, భధ్రతలకు విఘాతం కలిగిస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

 

 

Similar News