మళ్ళీ చంద్రబాబుకు ఓటు ఎందుకు వేయాలి?

Update: 2018-06-17 04:54 GMT

ఈ ప్రశ్నకు ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి దగ్గర ఎన్ని సమాధానాలు ఉన్నాయో తెలియదు కానీ...అక్కర్లేదు అని చెప్పటానికి మాత్రం చాలా కారణాలు ఉన్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు పెద్ద ఫెయిల్యూర్ సీఎంగా నిలిచిపోవటం ఖాయంగా కన్పిస్తోంది. పరిపాలనలో అత్యంత కీలక పాత్ర పోషించే ఐఏఎస్ అధికారులు కూడా గతంలో ఎన్నడూ చూడని అవినీతి చంద్రబాబును చూస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. చంద్రబాబుకు ఓటు వేయాల్సిన అవసరం లేదు అని చెప్పటానికి గల కారణాలు చూద్దాం ఓ సారి.

  1. ఉచిత ఇసుక ప్రజలకు కాదు..ఎమ్మెల్యేలకే అన్నందుకు ఓటు వేయాలా?
  2. రాజధాని సింగపూర్ కడుతుందని ఏపీ ప్రజలను అడ్డంగా మోసం చేసినందుకా?.
  3. చివరకు సింగపూర్ కంపెనీలతో కలసి సింగపూర్ లో కంపెనీ పెట్టించి ‘స్విస్ ఛాలెంజ్’ పేరుతో ‘ప్రైవేట్ దందా’ చేస్తున్నందుకా?
  4. నా ఇమేజ్ చూసి సింగపూర్ ప్రభుత్వం ఉచిత మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని చెప్పి..కోట్లకు కోట్లు ‘సుర్భానా’ సంస్థకు చెల్లించినందుకా?
  5. రైతుల దగ్గర నుంచి పూలింగ్ మార్గం ద్వారా రాజధాని పేరుతో తీసుకున్న భూములను సింగపూర్ సంస్థలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చినందుకా?.
  6. నాలుగేళ్ళు గడిచినా అసలు రాజధాని పనులు అడుగు కూడా ముందుకు పడనందుకా?

7.అంచనాలకు మించి అధిక చెల్లింపులు చేసి కట్టిన తాత్కాలిక రాజధానిని ‘చిల్లుల’ రాజధానిగా మార్చినందుకా?

  1. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ కట్టానని చెప్పి ఏ మాత్రం ఎలివేషన్ లేకుండా కోళ్ళఫారం షెడ్లలా కట్టినందుకా?. ఈ భవనాల కంటే ప్రైవేట్ యూనివర్శిటీ ఎస్ఆర్ ఎం యూనివర్శిటీ భవనాలు ఎంత బాగున్నాయో అక్కడి ప్రజలు చూస్తున్నారుగా?.
  2. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు సంబంధించిన వాణిజ్య స్థలాలను కూడా చివరకు ‘ప్రైవేట్ సంస్థలకు’ ఇస్తే తప్ప ఉపయోగం లేకుండా చేసినందుకా?.
  3. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా కేవలం డిజైన్లకే మూడున్నర సంవత్సరాలు గడిపేసిన ‘విజనరీ నేత’ చంద్రబాబు అయినందుకా?
  4. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ)లో మొక్కల కొనుగోలులోనూ కోట్లు బొక్కేసిన అవినీతిని చూసి రిటైర్డ్ అధికారి ఉద్యోగం కూడా వదిలిపెట్టి పారిపోయినందుకా?
  5. అమరావతి పనుల్లో టెండర్ టెండర్ కో ‘కండిషన్’ పెట్టి అస్మదీయ కాంట్రాకర్టకే పనులు దక్కేలా చేసినందుకా?
  6. ఏపీకి అత్యంత కీలకమైన, అవసరమైన భోగాపురం ‘గ్రీన్ ఫీల్ ఫీల్డ్ విమానాశ్రయం’ టెండర్ ను కమిషన్లకు ‘కక్కుర్తి’పడి కేబినెట్ లో పెట్టి మరీ రద్దు చేసినందుకా?

14.ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ విశాఖపట్నంలో తమకు 25 ఎకరాలు కావాలని అడిగితే...40 ఎకరాలు ఇచ్చి 150 కోట్ల రూపాయలపైన కుంభకోణానికి పాల్పడినందుకా?

  1. నీరు-చెట్టు పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినందుకా?
  2. దేశంలో ఏ రాష్ట్ర సీఎం చేయని తరహాలో నిత్యం విలాసవంతమైన ప్రత్యేక విమానాలు..హెలికాప్టర్లతో తిరుగుతూ వాచీ, ఉంగరం లేకుండా అత్యంత పేదవ్యక్తిగా ఉన్నందుకా?
  3. యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు 2000 రూపాయలు ఇస్తానని చెప్పి..నాలుగేళ్లు నాన్చి...ఎన్నికల ఏడాదిలో 1000 అని నిర్ణయం తీసుకున్నందుకా?
  4. రైతులకు ఎంత రుణం ఉంటే అంత మొత్తం మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పి...అధికారంలోకి వచ్చాక ఆంక్షల పేరుతో ‘కోతల’తో రైతులను మోసం చేసినందుకా?
  5. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతోపాటు...సీఎస్ తో సహా అందరూ వ్యతిరేకించినా సొలార్ పవర్ కొనుగోళ్ల ప్రతిపాదనను కేబినెట్ లో పెట్టి మరీ ఆమోదించి స్కామ్ కు తెరలేపినందుకా?
  6. ఏపీలో టాయిలెట్లు లేని స్కూళ్లను వదిలేసి...సింగపూర్ కు విమానాలు నడిపే సంస్థలకు వచ్చే నష్టాలు భరిస్తానని చెప్పినందుకా?

21.పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగాలంటే కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ స్ట్రాయ్ ను మార్చాలని చెప్పిన అధికారులను మార్చేసి...కాంట్రాక్టర్ కు కొమ్ముకాసినందుకా?. ముందు అధికారులు ఏమి చెప్పారో తర్వాత అదే చేసి...విలువైన కాలాన్ని..ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణం అయినందుకా?. పోలవరం అంచనాల పెంపు గోల్ మాల్ లెక్కేవేరు.

  1. ట్రాన్స్ స్ట్రాయ్ ని రక్షించటం కోసం ప్రపంచ బ్యాంకు అతి తక్కువ వడ్డీకి ఇచ్చే 200 కోట్ల రూపాయల రుణాన్ని వదులుకుని.. అత్యంత కీలకమైన కాకినాడ-రాజమండ్రి రోడ్డును అలాగే వదిలేసినందుకా?
  2. ప్రత్యేక హోదాతో అసలు ఏమి వస్తుంది. నన్ను ఎడ్యుకేట్ చేయండి. హోదాతో పరిశ్రమలు వస్తాయని ఎవరు చెప్పారు?. హోదా వచ్చిన రాష్ట్రాలు సాధించింది ఏమిటి? అని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించి..నాలుగేళ్ల తర్వాత ‘ప్రత్యేక హోదా’ కావాల్సిందే అంటూ యూ టర్న్ తీసుకున్నందుకా?
  3. గోద్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ సీఎం మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసి...మళ్లీ అదే మోడీని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎలాంటి షరతులు పెట్టకుండా, కనీసం ప్రజలకు వివరణ ఇవ్వకుండా బిజెపి చంకనెక్కిందుకా?. ఈ లెక్కన చంద్రబాబునాయుడు గోద్రా అల్లర్ల సమయంలో చేసిన డిమాండ్ తప్పా?. లేక రాజీపడి..రాజకీయ అవసరం కోసం మోడీతో జతకట్టారా?
  4. పట్టిసీమ ప్రాజెక్టులో వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినందుకా?
  5. వైఎస్ హయాంలో సాగిన అవినీతిపై వరసపెట్టి శ్వేతపత్రాలు ప్రకటించి...అందుకు కారణమైన ఒక్క అధికారిపై...ఒక్క సంస్థపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకా?

27.ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు చేసిన శ్రీసిటీ, నవయుగా సంస్థలతో ‘కలసికట్టుగా’ సాగుతున్నందుకా?

  1. సాగునీటి ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా ‘అంచనాలు’ పెంచుకుంటూ దోచుకుంటున్నందుకు ఓటు వేయాలా?
  2. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత అత్యంత కీలక నగరంగా ఉన్నవైజాగ్ లో భూ కుంభకోణాలకు తెరతీసినందుకా?
  3. ఐటి ప్రాజెక్టుల్లో ...ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో స్కామ్ చేసినందుకా?
  4. భాగస్వామ్య సదస్సుల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బోగస్ ఎంవోయులతో వేల కోట్ల పెట్టుబడులు...లక్షల్లో ఉద్యోగాలు అంటూ ఏపీ ప్రజలను బురిడీ కొట్టించినందుకా?
  5. నిత్యం విలువల జపం చేస్తూ అవసరం లేకపోయినా...ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేసినందుకా?
  6. పారదర్శకత గురించి కబుర్లు చెబుతూ నాలుగేళ్లు అయినా...హైకోర్టు చెప్పినా కూడా సమాచార హక్కు చట్టం కమిషనర్లను నియమించనందుకా?

34.మొదటి నుంచి ప్రధాని మోడీ చంద్రబాబును దూరం పెడుతున్నా...నలభై ఏళ్ళ అనుభవం ఉండి కూడా అంచనా వేయలేందుకా?

  1. ప్రజలు చేసుకోవాల్సిన పండగలను ప్రభుత్వం భుజానికెత్తుకుని...పుష్కరాలకు వేలకు వేల కోట్లు...పప్పు బెళ్లాలు పంచిపెడుతున్నందుకా?.
  2. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి..ఉత్తుత్తి నివేదకతో ఢిల్లీకి ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకున్నందుకా?ఇలా చెప్పుకుంటూ పోతే...చదవాలంటే మీకూ విసురురావొచ్చు. ఇవి చాలు ఆపేద్దాం.

Similar News