పరకాలపై కొత్త వివాదం లేపిన మంత్రి సోమిరెడ్డి

Update: 2018-06-19 13:54 GMT

పరకాల ప్రభాకర్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త వివాదాన్ని లేపారు. పరకాల టీడీపీ సభ్యుడు కాదు...సలహాదారు హోదాలో ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారని మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిందే నిజమైతే పరకాల టీడీపీ సభ్యుడు కాకుండా పార్టీ వేదిక అయిన ‘మహానాడు’ ఎక్కి ఎలా ఉపన్యాసాలు ఇచ్చారు. తీర్మానాలు ప్రవేశపెట్టారు. అంటే ప్రభుత్వంలో అధికారిక బాధ్యతలు నిర్వహించే వ్యక్తులు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా?. కేవలం సలహాదారు హోదాలో ఉంటే పరకాల అసలు మహానాడు వేదిక ఎక్కటమే నిబంధనలకు వ్యతిరేకం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం పరకాల పార్టీ వ్యక్తి కాదని మీడియా సాక్షిగా అంగీకరించారు. మహానాడు వేదికలో పార్టీ నేతలు మాత్రమే పాల్గొంటారు కానీ..ప్రభుత్వ అధికారులు ఎవరూ పాల్గొనరు. ఏదైనా ముఖ్యమంత్రికి సమాచారం అందజేయటం కోసం అయితే...వేదిక కింద ఉండి సాయం చేయటం ఒకెత్తు.

కానీ పరకాల గత కొన్ని మహానాడుల్లో పార్టీ నేతగా తీర్మానాలను ప్రవేశపెట్టారు. అంటే పార్టీకి చెందని వ్యక్తితో మహానాడులో తీర్మానాలు ప్రవేశపెట్టించారా?. సోమిరెడ్డి మాటలను పరిగణనలోకి తీసుకుంటే ఇది కొత్త వివాదాన్ని తెరలేపినట్లు అయింది. అంటే చంద్రబాబునాయుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులను కూడా మహానాడు వేదికలపైకి తీసుకొచ్చి తీర్మానాలు ప్రవేశపెట్టిస్తున్నారా?. ఓ వైపు పరకాల ప్రభాకర్..మరో వైపు కుటుంబరావులు నిబంధనలకు వ్యతిరేకంగా మంత్రివర్గ సమావేశాల్లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. గతంలో ప్రతిపక్షాలను విమర్శించేందుకు చంద్రబాబు అడ్డగోలుగా ప్రయోగించిన అస్త్రాలే ఇఫ్పుడు ఆయనకు ఎదురుతిరగుతున్నాయి.

 

 

Similar News