టీఆర్ఎస్ లో ‘డీఎస్’ కలకలం

Update: 2018-06-27 15:38 GMT

అధికార టీఆర్ఎస్ లో కలకలం. కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ పార్టీలోకి ఇన్. ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ ను పార్టీ నుంచి బయటకు పంపేందుకు ప్లాన్. డీఎస్ పై సాక్ష్యాత్తూ సీఎం కెసీఆర్ తనయ, ఎంపీ కవిత సారధ్యంలో ఫిర్యాదులు చేయటంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు డీఎస్ సీఎం కెసీఆర్ అపాయింట్ మెంట్ అడిగారని.. బుధవారం సాయంత్రం సమయం ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే డీఎస్ మాత్రం అసలు విషయం బయటపెట్టారు. తాను అసలు సీఎం అపాయింట్ మెంట్ అడగలేదని..సీఎం కార్యాలయం నుంచే కెసీఆర్ ను కలవాల్సిందిగా ఫోన్ వచ్చిందని..తర్వాత ఇఫ్పుడు కాదు అంటూ ఫోన్ చేశారని డీఎస్ మీడియాకు తెలిపారు. తాజా పరిణామాలపై డీఎస్ స్పందిస్తూ...ఈ పరిణామాలు దురదృష్టకరమని, క్రమశిక్షణ గురించి ఎవరో తనకు చెప్పాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు.

‘ఏవైనా తేడాలుంటే నాతో మాట్లాడాల్సింది. కానీ ఏకంగా ఫిర్యాదు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎంపీ కవితను, ఎమ్మెల్యేలనే అడగండి. ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా చెబితే అలా‌. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. అది ఆయన చేతుల్లోనే ఉంది.’ అన్నారు. తాను ఢిల్లీకి వెళ్లినమాట వాస్తవమేనని అయితే వ్యక్తిగత పనుల కోసమే తప్ప రాజకీయాల కోసం కాదని డీఎస్‌ స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీలోని నా క్వార్టర్‌ రిపేర్‌ పనులు జరుగుతున్నాయి. ఆ పని చూసుకుని తిరిగొచ్చేశాను. అక్కడ నేను కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ను కలిశానని చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు.

Similar News