చంద్రబాబు నోట ‘ముందస్తు మాట’

Update: 2018-06-12 08:31 GMT

సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు. అంతే కాదు..ముందస్తు ఎన్నికలకు ఛాన్స్ ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. ముందస్తు వచ్చినా సన్నద్దంగా ఉండాలంటూ నేతలను ఆదేశించారు. మంగళవారం నాడు విజయవాడలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలతో పాటే మోడీ సర్కారు పార్లమెంట్ ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశం ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బిజెపికి గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. దీంతో బిజెపి మరింత ఆత్మరక్షణలో పడింది. అత్యంత కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోనూ వ్యతిరేక ఫలితాలు తప్పవని..ఆ ఫలితాలు వచ్చాక ఎన్నికలకు వెళితే మరింత నష్టం అన్న భావనతో ఉన్న బిజెపి వాటితోపాటు పార్లమెంట్ ఎన్నికలకు కూడా వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు కూడా ఎన్నికలకు రెడీ అవుతున్నారు.

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చంద్రబాబు నాయకులను ఆదేశించారు.పార్టీ నేతలు ఎవరేం చేస్తున్నారో సమాచారం అంతా తన దగ్గర ఉందని..తాను తీసుకోబోయే చర్యలకే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని సమన్వయ కమిటీ సమావేశంలో హెచ్చరించారు. నేతలు గ్రామాల్లో తిరగటం మర్చిపోతున్నారని..ఇది మంచి పద్దతి కాదన్నారు. వారం లో ఒక్కసారి అయినా గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించాలని కోరారు. అదే సమయంలో ధర్మపోరాట దీక్షల అంశంపై కూడా చర్చించారు. త్వరలోనే మరికొన్ని జిల్లాల్లో ఈ ధర్మపోరాట దీక్షలు జరిపి..చివరి సమావేశాన్ని అమరావతిలో పెట్టాలని యోచిస్తున్నారు.

 

Similar News