తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్..ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చెల్లదు

Update: 2018-04-17 08:24 GMT

తెలంగాణ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో వీరిద్దరికి ఊరట లభించినట్లు అయింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరూ తమ పదవుల్లో కొనసాగే అవకాశం ఏర్పడింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్బంగా గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారనే ఆరోపణలతో ప్రభుత్వం తరపున శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు వీరిద్దరి సభ్యత్వాల రద్దుకు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సభ ఆమోదం పొందింది...దీంతో వీరి సభ్యత్వం రద్దు అయింది. వెంటనే వీళ్ళ సీట్లు ఖాళీ అయ్యాయని అసెంబ్లీ నోటిఫై చేయటం..ఆ వివరాలనుఎన్నికల సంఘానికి పంపటం చకచకా జరిగిపోయాయి. అయితే ఏకపక్షంగా..సరైన పద్దతి పాటించకుండా వీరిద్దరి సభ్యత్వాలను రద్దు చేశారనే విమర్శలు మొదటి నుంచి విన్పించాయి. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాల రద్దుపై హైకోర్టును ఆశ్రయించారు.

పలు దఫాలు ఈ కేసు ను విచారించిన హైకోర్టు మంగళవారం నాడు సంచలన తీర్పును వెలువరించింది. ప్రభుత్వం తరపున తొలుత సభలో జరిగిన ఘటనలకు సంబంధించి వీడియో ఫుటేజీ ఇస్తామని అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ సర్కారు తర్వాత ససేమిరా అనటంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. తర్వాత కోర్టు పలుమార్లు అడిగినా అసలు ఫుటేజీ వ్యవహారం తమకు సంబంధం లేదని..అది సభ పరిధిలోని అంశం అంటూ సమాధానం ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇది ప్రభుత్వం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఇంత కాలం సభా వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవన్న వాదనలు వీగిపోయినట్లు అయింది.

 

 

Similar News