పవన్ కళ్యాణ్ లో ఈ ‘గుణాత్మక’ మార్పేమిటి?

Update: 2018-03-15 04:04 GMT

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. నిన్న మొన్నటివరకూ తెలుగుదేశం ప్రభుత్వ ఇమేజ్ ను కాపాడేందుకు పలు ‘రక్షణాత్మక’ చర్యలకు దిగిన జనసేనాని ఇప్పుడు ఒక్క సారిగా ‘రణ’ నినాదం అందుకోవటం వెనక మతలబు ఏమిటి?. నాలుగేళ్ళ పాటు టీడీపీని ఒక్కటంటే ఒక్క మాట కూడా అనని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అవిర్భావ సభలో ఎవరూ ఊహించని రీతిలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేయటంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర షాక్ కు గురైందనే చెప్పొచ్చు. అయితే పవన్ వైఖరి చూస్తుంటే భవిష్యత్ లో తన ప్రత్యర్థులుగా ఉండబోయే జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్ లు తీవ్ర స్థాయి అవినీతిలో కూరుకుపోయారని..తానొక్కడినే క్లీన్ ఇమేజ్ తో ఉన్నట్లు ఓటర్లకు సంకేతాలు పంపాలనే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో తనకు కలసి వస్తుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు. సీని గ్లామర్ కు తోడు తనకున్న క్లీన్ ఇమేజ్, ఇతర సమీకరణలను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

అందులో భాగంగానే భవిష్యత్ లోనూ అధికార టీడీపీపై ఎటాక్ ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా రోజులు అధికార టీడీపీని వదిలేసి..ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేసిన తీరు రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందుకే నిన్నమొన్నటివరకూ వైసీపీ నేతలు పవన్ ను ప్యాకేజీస్టార్ అంటూ తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పవన్ చర్యలు కూడా ఈ ఆరోపణలను నమ్మేలా ఉండేవి. ఒక్క మాటలో చెప్పాలంటే కారణాలు ఏమైనా పవన్ కళ్యాణ్ ఇంత కాలం టీటీడీకి మద్దతు ఇవ్వటం ద్వారా తనపై పెద్ద మరకే వేసుకున్నారు. గుంటూరు సభతో ఇది కొంత వరకూ పోయినా..దీన్నుంచి పూర్తిగా బయటకు రావటానికి ఇంకా చాలా కసరత్తు చేయాల్సి ఉంది. విచిత్రం ఏమిటంటే వైసీపీ నేతలు నిన్నటి వరకూ పవన్ ను టీడీపీ ప్యాకేజ్ స్టార్ అంటూ విమర్శలు గుప్పిస్తే...ఇప్పుడు ఏకంగా చంద్రబాబు అండ్ కో సాక్షిలో వచ్చిన వార్తలే ఆయన చదివారని..ఆయన వెనక ఎవరో ఉన్నారనే వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు అప్పుడే పవన్ పై ‘ఎటాక్’ ప్రారంభించాయి. చూడబోతుంటే ఏపీ రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత ‘రంజు’గా మారటం ఖాయంగా కన్పిస్తోంది. టీడీపీ నేతలు కొత్తగా పవన్ ను బిజెపి వెనక ఉండి నడిపిస్తోందని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

 

 

 

 

Similar News