400 కోట్ల రూపాయల విలువైన భూమి 13 కోట్లకే కేటాయింపు
చేతులు మారిన కోట్లాది రూపాయలు!
తిరుమలరావు చమిళ్ళదే కుంభకోణంలో కీలకపాత్ర
కంపెనీ కోరుకున్నట్లే జీవో జారీ
ప్రైవేట్ కంపెనీల ముందు సాగిలపడిన సర్కారు
సార్వభౌమాధికారం గల సర్కారు ప్రైవేట్ సంస్థల ముందు సాగిలపడింది. విశాఖపట్నంలో 400 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 13 కోట్ల రూపాయలకే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్ మెంట్స్, ఇన్నోవా సొల్యూషన్స్ ఐఎన్ సీకి అప్పనంగా అప్పగించేశారు. ఈ రెండు సంస్థలు మాకు 40 ఎకరాలు ఇవ్వండి..మేం చెరి 25 ఎకరాలు, 15 ఎకరాలుగా పంచుకుంటాం అంటే మీ ఇష్టం అంటూ తలూపేసింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు 25 ఎకరాలు...ఇన్నోవా సొల్యూషన్స్ కు 15 ఎకరాలు కేటాయించారు. ఇది విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన పెద్ద రుషికొండ ప్రాంతంలోని రుషికొండపై ఉంది. సముద్రానికి అభిముఖంగా ఉండే ఈ భూమిని వాస్తవానికి ఓ హోటల్ కోసం రిజర్వ్ చేసి పెట్టారు. పెద్దల జోక్యంతో ఇది ఇప్పుడు దారిమళ్లింది. ఇక్కడ ఎకరా ధర 10 కోట్ల రూపాయలు ఉంటే..సర్కారు మాత్రం ఈ సంస్థలకు కారుచౌకగా ఎకరా 32.50 లక్షల రూపాయలకే కేటాయించేసింది.ఐతే ఈ సంస్థలు తమకు భూమిని పూర్తిగా చదునుచేసి ఇవ్వటంతోపాటు రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ సదుపాయాలు కల్పించి అందజేయాలని కోరాయి. దీనికి సర్కారు సరే అందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ గోల్ మాల్ వ్యవహారంలో కీలకపాత్ర పోషించింది మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి ఏజెన్సీ సీఈవోగా ఉన్న తిరుమలరావు చమిళ్ళ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయనే ముందు ఉండి అంతా నడిపించగా..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ లు ఆగమేఘాల మీద ఈ ఫైలు క్లియర్ చేశారు.
ఇది చూసిన ఓ ఉన్నతాధికారి ఈ వ్యవహారం చూస్తుంటే ఎవరో ఒకరు జైలుకువెళ్ళక తప్పేలా లేదని వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఏపీలో కొత్తగా చంద్రబాబునాయుడి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే నూతన ఐటి విధానాన్ని అమల్లోకి తెచ్చారు. సర్కారు తెచ్చిన ఐటి విధానానికి సర్కారే తూట్లు పొడిచి మరీ ఈ భూ కేటాయింపులు చేసింది. పోనీ ఈ సంస్థ ఏమైనా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుందా? అంటే అదీ లేదు. విశాఖపట్నంలో నాలుగు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమి దక్కించుకున్న రెండు సంస్థలు ఎనిమిదేళ్ళలో కల్పించే ఉద్యోగాలు కేవలం 2500 మాత్రమే. జీవోలో 400 కోట్ల రూపాయల విలువైన భూములు దక్కించుకున్న సంస్థలు ఎంత పెట్టుబడి పెట్టబోతున్నాయో కూడా కనీసం ప్రస్తావించకపోవటం దారుణం. పైగా ఈ విలువైన భూమిని పూర్తిగా ఆయా సంస్థల పేరుమీద సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు.
ఈ ప్రైవేట్ సంస్థలు మాత్రం తమ భూ కేటాయింపులు రద్దు చేయటానికి వీల్లేదని ముందస్తు షరతులు పెట్టాయి. దీనికి సర్కారు ఓకే అంది. అంటే ఈ సంస్థలు ఒప్పందాన్ని అమలు చేయకపోయినా ప్రభుత్వం ఈ భూమిని వెనక్కితీసుకునే ఛాన్స్ ఉండదన్న మాట. అంతే కాదు ఐటి కంపెనీల పేరుతో ఇచ్చిన భూమిలో కొంత మొత్తాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకోవటానికి కూడా సర్కారు ఆమోదించింది. దీంతోపాటు విశాఖపట్నంలో ఇంక్యుబేషన్ , ప్లగ్ అండ్ ప్లే సర్వీసుల కోసం రాయితీ రేట్లపై రేండెళ్ళ పాటు పది వేల ఎస్ఎఫ్ టీ ఇవ్వటానికి కూడా సర్కారు అంగీకరించింది. దీన్ని మరో 18 నెలలు పొడిగించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ భూ కేటాయింపులు చూస్తుంటే చంద్రబాబు, లోకేష్ లు వైఎస్ రికార్డు ను కూడా బ్రేక్ చేసేలా ఉన్నారు.