‘సింగపూర్’లో చంద్రబాబు కంపెనీ

Update: 2018-02-05 00:57 GMT

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ‘సింగపూర్’లో ఓ హోటల్ ఉందని ఎప్పటి నుంచే రాజకీయ వర్గాల్లో ప్రచారం. కానీ ఇప్పటివరకూ అది ఎవరూ ప్రూవ్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సింగపూర్ లో చంద్రబాబునాయుడు ఓ ప్రైవేట్ హోల్డింగ్ కంపెనీ పెట్టించారు. అదీ సర్కారుకు చెందిన ఓ సంస్థతో. అందులో భాగస్వాములు రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం స్విస్ ఛాలెంజ్ మోడల్ లో ముందుకొచ్చిన కంపెనీలు అయిన అసెండాస్, సింగ్ బ్రిడ్జి,సెంబ్ కార్ప్ డెవలప్ మెంట్ లిమిటెడ్ లు కావటం విశేషం. ఆ కంపెనీయే సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్ (ఎస్ఏఐహెచ్). అసలు రాజధాని అమరావతి నిర్మాణంలో ఏ మాత్రం పాత్రలేని ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీ ఈడీబీ) కొత్తగా తెరపైకి ఎందుకు వచ్చింది?. అసలు ఏపీకి చెందిన ఓ సంస్థ సింగపూర్ ప్రైవేట్ సంస్థలతో కలసి జాయింట్ వెంచర్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్ కంపెనీయే ఏపీ నూతన రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిలో భాగస్వామి అవుతుందని స్పష్టంగా పేర్కొన్నారు.

సింగపూర్ సంస్థలు నేరుగా సీఆర్ డీఏతో ఒప్పందానికి ఎందుకు వెనకాడుతున్నాయి?. భారతీయ చట్టాలకు ఎందుకు భయపడుతున్నాయి?. చంద్రబాబు చెబుతున్నట్లు అసలు ఆయన తప్పేమీ చేయకపోతే కొత్తగా ఈ ప్రైవేట్ హోల్డింగ్ కంపెనీని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. చట్టాలను కూడా మార్చేసి సింగపూర్ సంస్థలకు దాసోహం అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ సంస్థల ప్రయోజనం కోసం మరో సాహసం చేశారు. అదే ఈ హోల్డింగ్ కంపెనీ. స్విస్ ఛాలెంజ్ విదానం కింద ప్రాజెక్ట్ దక్కించుకున్న సంస్థలు నేరుగా సర్కారుతో ఒప్పందానికి ముందుకు రాకుండా ఈ హోల్డింగ్ కంపెనీని సృష్టించాయి. ఈ సంస్థతో ఒప్పందాలకు ఏపీ న్యాయ శాఖతోపాటు ఆర్థిక శాఖ కూడా నో చెప్పాయి. ఏ ప్రయోజనం లేకుండా ఎందుకు చంద్రబాబు సింగపూర్ కంపెనీలకు ఇంతలా దాసోహం అంటున్నారనేది అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

 

Similar News