తెలంగాణలో లగడపాటి సర్వే ఎవరి కోసం!

Update: 2018-01-11 06:04 GMT

సర్వేల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేయించే వాటికి ఓ ప్రత్యేకత ఉంది. చాలా వరకూ లగడపాటి జోస్యం చెప్పారంటే అవి చాలాసార్లు పక్కాగా కరెక్ట్ అని తేలాయి. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయంగా ఎంత వివాదస్పదుడు అయినా ఆయన సర్వేలను మాత్రం ఆయన్ను తీవ్రంగా విభేదించే వారు కూడా నమ్ముతారు. అంతటి నమ్మకం ఆయన సర్వేలు అంటే. అయితే తెలంగాణలో రాజగోపాల్ సర్వే చేయించుతున్నట్లు రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది. ఓ కీలక నేత సూచన మేరకు ఆయన ఈ సర్వేకు పూనుకున్నారని... ఆ ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన రంగంలోకి దిగేందుకు సన్నద్ధం అయినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఆ కీలక నేత చేయించుకున్న సర్వేల్లో ఫలితాలు తేడాగా వస్తున్నాయని..అందుకే ఈ విషయంలో అందరూ నమ్మే రాజగోపాల్ ను ఆయన కూడా నమ్మినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

త్వరలోనే ఈ సర్వేకు సంబంధించిన సమగ్ర నివేదిక రానుందని..అది వచ్చిన తర్వాత ‘బ్లూ ప్రింట్’ సిద్ధం చేసుకునే పనిలో ఆ కీలక నేత ఉన్నట్లు సమాచారం. అధికార టీఆర్ఎస్ పైకి ఎంత గాంభీర్యం ప్రదర్శిస్తున్నా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నుంచి పెద్ద సవాలే ఎదురుకానుంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కూడా ఢీ అంటే ఢీ అనే చందంగా స్పీడ్ పెంచింది. ప్రస్తుతం ఎవరి ఎత్తులు వాళ్ళు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే లగడపాటి రాజగోపాల్ చేసే సర్వే పూర్తిగా ‘ప్రైవేట్’ వ్యవహారం కావటంతో బయటకు వివరాలు రావటం అంత సులభంకాదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Similar News