బాలకృష్ణ ఆ పని వ్యూహాత్మకంగానే చేశారా!

Update: 2018-01-27 04:42 GMT

తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఈ నెల 24న బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సీటులో కూర్చుని అనంతపురం జిల్లాలో నిర్వహించతలపెట్టిన లేపాక్షి ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పెద్ద దుమారపే రేపిన సంగతి తెలిసిందే. బాలకృష్ణకు ఆ సీటులో కూర్చోకూడదనే విషయం తెలియదనుకుంటే పొరపాటే అని...24న రథసప్తమి కావటంతో ఆయన కావాలనే ఆ సీటులో కూర్చున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే బాలకృష్ణ ఎక్కువగా ‘నమ్మకాల’ను పాటిస్తారు. ప్రతి పనీ కూడా సిద్ధాంతులు చెప్పిన ప్రకారమే చేస్తారు. అందులో భాగంగానే రథసప్తమి రోజు అలా చేస్తే కోరికలు నెరవేరే అవకాశం ఉందని పండితులు చెప్పటంతోనే అలా చేశారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు చంద్రబాబు తీరుపై బాలకృష్ణ ఒకింత అసంతృప్తిగానే ఉన్నారు.

తన నియోజకవర్గం హిందుపురంలో పార్టీ నేతలు చేసిన పెద్ద ఎత్తున ఆందోళన సమయంలో కనీసం చంద్రబాబు నియోజకవర్గ నేతలతో పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవు. అంతకు ముందు పలు సమావేశాల్లో తనకు ‘ప్రాధాన్యత’ కల్పించాలని బాలకృష్ణ కోరినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని ఓ సీనియర్ నేత తెలిపారు. రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో కూడా తనకు వేదికగా సీటు కావాలని బాలకృష్ణ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు ససేమిరా అన్నారు. ప్రధానితోపాటు విదేశీ అతిధులు ఉన్నందున సాధ్యంకాదని తేల్చేశారు. అయితే రథసప్తమి రోజు బాలకృష్ణ కావాలని సీఎం సీటులో కూర్చోవటం ఒకెత్తు అయితే.. అసలు ఓ ఎమ్మెల్యేకు అధికారులతో అలా సమావేశం సమీక్షా సమావేశం నిర్వహించే అధికారమే లేదని న్యాయశాఖకు చెందిన నిపుణుడు ఒకరు తెలిపారు.

 

Similar News