టార్గెట్ నరసింహన్ వయా బిజెపి

Update: 2018-01-17 04:30 GMT

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బిజెపి భుజాలపై గన్ పెట్టి గవర్నర్ నరసింహన్ టార్గెట్ చేశారా?. అంటే అవునంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా బిజెపి ఎంపీ, ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం ఏపీ బిజెపి శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు కూడా గవర్నర్ నరసింహన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గవర్నర్ నరసింహన్ నిర్ణయాలు కూడా పలు వివాదస్పదం అయ్యాయి. ఏపీకి చెందిన నేతలు పలువురు గవర్నర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాట కూడా వాస్తవమే. నిజానికి పరిపాలన అంతా గవర్నర్ పేరు మీద సాగినా..పరిపాలనలో ఆయన పాత్ర చాలా పరిమితం. గవర్నర్ మార్పు వల్ల రాష్ట్ర ప్రగతి ఏమైనా పరుగులు పెడుతుందా? అంటే అదేమీ ఉండదు. కాకపోతే తమతో సవ్వంగా ఉండే గవర్నర్లు ఉండాలని ప్రభుత్వాలు కోరుకోవటం సహజమే. కానీ బిజెపి ఎంపీకి, బిజెపి శాసనసభాపక్ష నేతకు గవర్నర్ మార్పు..కొత్త వారి నియామకం వల్ల వచ్చే లాభనష్టాలు ఏమీ ఉండవు. తమ పరిపాలన అంతా ఏపీకి వెళ్లినందున ఏపీలో ఉండేలా తమకు కొత్త గవర్నర్ ను నియమించాలని ప్రభుత్వం కోరటంలో తప్పేమీ లేదు.

కానీ బిజెపి నేతలు వరస పెట్టి గవర్నర్ ను టార్గెట్ చేయటం..ఇప్పుడు ఏకంగా కేంద్ర హోం మంత్రికి లేఖ రాయటం వెనక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హస్తం ఉండి ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని పలువురు మంత్రులు గవర్నర్ నరసింహన్ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఏపీపై పక్షపాతం చూపిస్తున్నారనే భావనతో ఉన్నారు. ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే గవర్నర్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఏ గవర్నర్ కూడా నరసింహన్ తీరుగా వ్యవహరించలేదు..అదే సమయంలో ప్రతిపక్షాలతో అన్ని విమర్శలు ఎదుర్కోలేదని చెప్పొచ్చు. మొత్తానికి గవర్నర్ నరసింహన్ ఓ వివాదస్పద గవర్నర్ గా మిగిలిపోనున్నారు. మరి బిజెపి నేతల లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

 

 

Similar News