వాట్సప్ గతంలో ఎన్నడూలేని రీతిలో వివాదాల్లో చిక్కుకుంటోంది. కొత్తగా తెచ్చిన ప్రైవసీ పాలసీతోనే ఈ తిప్పలు వస్తున్నాయి. వాట్సప్ వినియోగదారులు చాలా మంది ఇప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా 'సిగ్నల్ ' యాప్ వైపు మళ్ళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది వాట్సప్ లో కలవరం రేపుతోంది. అందుకే వరస పెట్టి వివరణల మీద వివరణలు ఇస్తోంది. మంగళవారం నాడు తాజాగా మరోసారి పలు అంశాలపై స్పష్టత ఇచ్చింది. కొత్తగా తెచ్చిన మార్పుల వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణల సందేశాల గోప్యతకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది.
వినియోగదారుల సందేశాలు ఎండ్ టు ఎండ్ ఎన్కిప్షన్ తో అత్యంత సురక్షితంగా ఉంటాయని పేర్కొంది. వాట్సప్ వినియోగదారుల వ్యక్తిగత సందేశాలను చూడలేదు..వినలేదన్నారు. వినియోగదారులు షేర్ చేసిన లోకేషన్ ను వాట్సప్, ఫేస్ బుక్ చూడలేవన్నారు. వాట్సప్ వినియోగదారుల కాంటాక్ట్స్ ను ఫేస్ బు క్ తో షేర్ చేసుకోదన్నారు. ఫేస్ బుక్ తో డేటా షేరింగ్ విషయంలో వాట్సప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ విమర్శలు రావటంతోపాటు తీవ్ర దుమారం రేగుతోంది. బిజినెస్ ఫీచర్స్ ను మరింత అత్యుత్తమ సేవలు అందించేందుకు వీలుగా మాత్రమే మార్పులు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.