ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. అమెరికా నేరుగా రంగంలోకి దిగటంతో రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్నదే ఇప్పుడు అందరిలో టెన్షన్ రేపుతున్న అంశం. గత కొన్ని రోజులుగా ఇరాన్ కు అమెరికా హెచ్చరికలు జారీ చేస్తున్నా ఆ దేశం వీటిని పెద్దగా పట్టినుంచుకున్న దాఖలాలు లేవు. ఈ తరుణంలో ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్ గా చేసుకుని దాడులు చేసినట్లు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్
ప్రకటించారు. అయితే ఇది ఇంత తొందరగా ఉంటుంది అని ఎవరూ ఊహించలేదు. ఈ దాడుల తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాలను అధికారికగా వెల్లడించారు. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిందని ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా తెలిపారు. ఇజ్రాయెల్ కూడా గత కొన్ని రోజులుగా ఇవే లక్ష్యంతో దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రతీకార బెదిరింపుల నేపథ్యంలో ఎటాక్ చేశామని వెల్లడించారు.
దీంతో మధ్యప్రాచ్యంలో దాడులుమరింత పెరిగే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత తొమ్మిది రోజులుగా ఇజ్రాయెల్- ఇరాన్ ల మధ్య దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరాన్ పలు విభాగాల్లో దారుణంగా దెబ్బతిన్నట్లు రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. అయినా సరే ఇరాన్ ఏ మాత్రం వెరవకుండా ఇజ్రాయిల్ పై అటాక్ చేస్తూనే వస్తోంది. అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని ఇరాన్ హెచ్చరించింది. అయితే వీటిని బేఖాతరు చేసిన అమెరికా స్పెసిఫిక్ టార్గెట్ గా ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా దెబ్బతీసేలా బీ 2 స్పిరిట్ బాంబర్ల తో దాడులకు దిగింది. ఇరాన్ లోని అణు కేంద్రాలు అయిన ఫోర్డో, నతంజ్, ఇస్ఫాహాన్ లపై భారీ దాడులకు దిగింది. తమ పని పూర్తి అయింది అని ...ఇక ఇరాన్ శాంతికి సిద్ధం కావాలి అంటూ ట్రంప్ పిలుపునిచ్చారు.
ఇరాన్ లో అణు కేంద్రాలు టార్గెట్ గా దాడులు పూర్తి చేసి తమ విమానాలు సురక్షితంగా వెనక్కి వచ్చాయని ట్రంప్ వెల్లడించారు. అమెరికా తప్ప ప్రపంచంలో మరే దేశం ఇలాంటి దాడులు చేయలేదు అని చెప్పారు. అమెరికా ఈ దాడుల ద్వారా ఇరాన్ అణు సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీసినట్లు భావిస్తోంది. ఇరాన్ అణు వ్యవస్థ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా ఆందోళనలు రేకెత్తిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దీనిని మధ్య ప్రాచ్యంలో స్థిరత్వానికి ముప్పుగా భావిస్తున్నాయి. ఇరాన్ ఈ దాడులకు ప్రతిస్పందనగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, తగిన సమయంలో సమాధానం ఇస్తామని ప్రకటించింది. దీంతో ఈ పరిణామాలు మధ్య ప్రాచ్యంలో సైనిక సంఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఇజ్రాయెల్ స్వాగతించింది. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ వెంటనే ఇజ్రాయెల్ మిస్సెల్స్ ఎటాక్ ప్రారంభించింది. మరో వైపు అమెరికా దాడులను ముందే ఊహించిన ఇరాన్ తన అణు స్థావరాల నుంచి కీలక సామాగ్రిని, యురేనియం నిల్వలను అక్కడ నుంచి ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఎంత మేర నిజం ఉన్నది అమెరికా నే తేల్చాల్సి ఉంది అని చెపుతున్నారు.