ఉక్రెయిన్ లో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని..ఎక్కడి వారు అక్కడే ఉండాలని భారత్ సూచించింది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను ఉద్దేశించి తాజాగా ఈ సూచన చేసింది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు అందరూ సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ఆ దేశంలో పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండాలని పేర్కొంది. ముఖ్యంగా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల నుంచి ఆ దేశ రాజధాని కీవ్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్న భారతీయులంతా తిరిగి తమ తమ ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సూచనలే పాటించాలని కోరింది. ఉక్రెయిన్ లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశాంగ శాఖ ఇప్పటికే హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. ఉక్రెయిన్ వివాదం తెరపైకి రాకముందు ఆ దేశంలో 22 వేల మంది భారతీయులు ఉన్నట్టుగా అధికార వర్గాలు అంచనా వేశాయి.
ఇందులో సుమారు వెయ్యి మంది వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఉద్రిక్తలు ప్రారంభం కాగానే చాలా మంది స్వదేశం బాట పట్టారు. మరికొందరు తాము చదువుతున్న యూనివర్సిటీల నుంచి సెలవు/ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి అధికారిక సమాచారం రాకపోవడంతో అక్కడే ఉండిపోయారు. . ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం ఉక్రెయిన్‌లో ఇంకా 18 వేల మంది వరకు ఇండియన్లు ఉండవచ్చని అంచనా. ఉక్రెయిన్ తాజా పరిస్థితుల నేపథ్యంలో తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. దీంతో భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం వెనక్కి తిరిగి వచ్చేసింది.