ఒక వైపు సుంకాల మోత. మరో వైపు లక్షల మంది విద్యార్ధులకు షాక్ ఇచ్చే నిర్ణయాలు. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కసి తో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్ విషయంలో ఆయన వైఖరి ఇదే తరహాలో ఉంది. అగ్రరాజ్యంలో చదువుకుంటున్న విద్యార్ధులపై డోనాల్డ్ ట్రంప్ మరో బాంబు వేయటానికి సిద్ధం అయ్యారు. ఈ దిశగా ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇది అమల్లోకి వస్తే ప్రస్తుతం అమెరికా లో చదువుకుంటున్న మూడున్నర లక్షల వరకు ఉన్న భారతీయ విద్యార్ధులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికి విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్స్ వెట్టింగ్ పేరుతో పలు కొత్త నిబంధనలు తెర మీదకు తెచ్చారు. ఇప్పుడు అమెరికాలో చదువుకోడానికి వెళ్లే విద్యార్థులు ఆ దేశంలో ఉండే సమయానికి సంబంధించి ఆయన ఒక కొత్త కాలపరిమితిని తీసుకురాబోతున్నారు. స్టూడెంట్ వీసా మీద ఉన్న విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే విశాలకు కాలపరిమితి విధిస్తూ కొత్త ప్రతిపాదనలను తెచ్చింది. దీని ప్రకారం విద్యార్థులు నాలుగు సంవత్సరాలకు మించి అమెరికా లో ఉండకుండా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అయితే వాళ్ళు ఎంతకాలం అంటే అంత కాలం అక్కడ చదువుకోడానికి, అదే సమయంలో ఇంటర్న్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనటానికి వెసులుబాటు ఉండేది. ఎఫ్ 1 వీసా పై అమెరికా లో ఉన్న విద్యార్థులతో పాటు జె 1 వీసా లో ఉన్న ఎక్స్చేంజ్ విజిటర్లకు కాలపరిమితి విషయంలో వెసులుబాటు ఉండేది. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఇవి ఉండవు. అందుకే ఈ ఫ్లెక్సిబుల్ వీసా విధానంలో మార్పులు తెచ్చేందుకు డిపార్ట్ మెంట్ అఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ రంగం సిద్ధం చేసింది.
అందులో భాగంగానే ఇప్పుడు స్టూడెంట్ వీసాల తో పాటు ఎక్స్చేంజ్ ప్రోగ్రాం లో వచ్చే వాళ్ళ వీసా లపై కాలపరిమితి పెట్టబోతున్నారు. కొత్తగా చేయనున్న మార్పుల ప్రకారం చూస్తే ఇక నుంచి అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థులు గరిష్టంగా నాలుగు సంవత్సరాలు ఉండటానికి అనుమతి ఇస్తారు. ఎఫ్ 1 విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత వీసా మార్చుకోవాలనుకుంటే దీనికి ఉన్న గ్రేస్ పీరియడ్ ను అరవై రోజుల నుంచి 30 రోజుల కు తగ్గించారు. ఈ ముసాయిదా ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయాలు స్వీకరించి తర్వాత వాటిని నోటిఫై చేయనున్నారు. మరో వైపు అలాంటిది ఏమి లేకుండానే ఇవి తక్షణం అమల్లోకి వచ్చేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసే అవకాశం కూడా ఉంది అని చెపుతున్నారు.