అంచనాలే నిజం అయ్యాయి. ఎయిర్ ఇండియా టాటాల పరం కానుంది. టాటా సన్స్ విజేతగా నిలుస్తుందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల దగ్గర నుంచి అందరిలో ఉంది. ఆర్ధిక బిడ్లు సమర్పించిన సంస్థల్లో టాటా సన్స్ తోపాటు..స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ ఉన్నారు. అయితే అందరి కంటే టాటా సన్స్ ఆఫర్ మెరుగ్గా ఉండటంతో మంత్రుల కమిటీ టాటా సన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎయిర్ ఇండియా టాటా సన్స్ పరం కానుండటంతో ప్రారంభించిన సంస్థ చేతికే ఈ ఎయిర్ లైన్స్ వెళ్ళినట్లు అవుతుంది. స్వాతంత్రానికి పూర్వమే టాటా సన్స్ ఈ ఎయిర్ లైన్స్ ను ప్రారంభించింది. తర్వాత ప్రభుత్వం దీన్ని జాతీయం చేసి ఎయిర్ ఇండియాగా నామకరణం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఇండియా టాటాల చేతికి చేరనుండటం విశేషం. భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది.
ఈ సారి మాత్రం ఇది ఓ కొలిక్కి వచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిర్ ఇండియాలో వంద శాతం వాటాలను కేంద్రం అమ్మకానికి పెట్టింది. బిడ్ లో విజేతగా నిలిచిన సంస్థకు ఎయిర్ ఇండియా విమానాలతో పాటు ఎయిర్ ఇండియాకు చెందిన స్థిర, చర ఆస్తులు దక్కుతాయి. ఈ పెట్టుబడుల ఉపసంహారణ ద్వారా కేంద్రం .20,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది. దీంతో టాటా సన్స్ ఆధీనంలోని సంస్థల చేతిలో మూడు ఎయిర్ లైన్స్ ఉన్నట్లు అవుతుంది. ఇప్పటికే టాటా గ్రూప్ నకు విస్తారాతోపాటు ఏయిర్ ఆసియా ఇండియాలో వాటాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా ఈ గ్రూప్ చేతికి చేరనుంది.