ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ సోమవారం నాడు టాటా పంచ్ మైక్రో ఎస్ యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. ఈ కారు ప్రారంభ ధర 5.49 లక్షలుగా నిర్ణయించారు. ఇది ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర. ఈ ధర 2021,డిసెంబర్ 31వరకు అలాగే కొనసాగుతుందని టాటామోటార్స్ ప్రతినిధులు వెల్లడించారు. టాటా పంచ్ వాహనం నిస్సాన్ మాగ్నైట్, రెనాల్డ్ కైగర్, హ్యుండయ్ గ్రాండ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్ తో పోటీపడే అవకాశం ఉందని ఈ రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. కొత్తగా విడుదల చేసిన టాటా పంచ్ ఏఎంటీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) సౌకర్యంతో కూడిన వాహనం కావాలనుకుంటే బేసిక్ ధరకు అదనంగా మరో అరవై వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత కొద్ది కాలంగా కార్ల మార్కెట్‌లో టాటా పంచ్ ఎస్‌యూవీ వెహికల్ ఆసక్తి రేపుతోంది.
అందుకు కారణం యూకేకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం(ఎన్‌సీఏపీ)ను నిర్వహిస్తుంది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా మనదేశంలో 'సేఫర్ కార్స్ ఫర్ ఇండియా' పేరుతో పలు కార్లపై టెస్టులు నిర్వహించింది. ఆ టెస్టుల్లో కార్ల సేఫ్టీని బట్టి స్టార్ రేటింగ్‌ను ఇచ్చారు. తాజాగా నిర్వహించిన సేఫర్ కార్స్ క్యాంపెయినింగ్‌లో టాటా పంచ్ కారు 5 స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. పిల్లల సేప్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందిన టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీలో 7అంగుళాల టచ్ స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో పాటు ఐఆర్‌ఏ కనెక్టివిటీ సూట్, స్మూత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కోసం 90 డిగ్రీల ఓపెన్ డోర్స్, ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్,క్రూయిస్ కంట్రోల్, కూలెడ్ గ్లోవీ బాక్స్, 4స్పీకర్స్, ఆటో సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్ లైట్స్ ఫీచర్స్ ఉంటాయి.