వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం స్టే

Update: 2021-01-12 08:25 GMT

కేంద్రంలోని మోడీ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించింది. ఈ చట్టాలను దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా వీటి ఉపసంహరణకు కేంద్రం ససేమిరా అంటూ వచ్చింది. దీంతో కేంద్రానికి సుప్రీంకోర్టు తాత్కాలికంగా బ్రేకులు వేసింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లకు సంబంధించి పూర్తి తీర్పు వచ్చే వరకూ ఈ స్టే కొనసాగుతుందని ప్రకటించింది. అదే సమయంలో వ్యవసాయ చట్టాలకు సంబంధించి తలెత్తిన సమస్య, రైతుల అభ్యంతరాల పరిష్కారం కోసం కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. హర్ సిమ్రత్ మాన్, ప్రమోద్ జోషి, అశోక్ గులాటి, అనిల్ ధన్వంత్ లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించటం కాదని, ధర్మాసనానికి ఈ కమిటీ నివేదిక అందిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొంది.

కమిటీని నియమించే అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ బోబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణ్యంలతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. రైతుల ఆందోళనకు సంబంధించి కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. తాము నియమించే కమిటీ రైతు ప్రతినిధులు, కేంద్రంతో చర్చలు జరుపుతుందని తెలిపింది. అయితే రైతు కమిటీల ప్రతినిధులు ఈ కమిటీ ముందు తమ వాదనలు విన్పించేందుకు తొలుత అంగీకరించలేదు. ఈ కమిటీ ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం వహిస్తుందేమో అన్న అనుమానాలను వారి తరపు లాయర్లు వ్యక్తం చేశారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఖచ్చితంగా రైతుల తరపున వారి ప్రతినిధులు కమిటీ ముందు వాదనలు విన్పించాల్సిందేనని..కమిటీ సిఫారసుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

Tags:    

Similar News