ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే అంశంపై స్తంభించిపోతున్నాయి. ఈ తరుణంలో పార్లమెంట్ లో శుక్రవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై దాఖలు చేసిన పిల్‌ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పెగాసస్ కుంభకోణంపై కోర్టు పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తు కోరుతూ ప్రముఖ జర్నలిస్టులు ఎన్ రామ్, శశి కుమార్ ఇతరులు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఆగస్టు మొదటి వారంలో విచారణ చేపడతామని ప్రకటించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని బెంచ్ దీనిపై విచారణ జరపనుంది.
జాతీయ భద్రతపై పెగాసెస్ పర్యవసానాల కారణంగా దీనిపై విచారణ అత్యవసరం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ తెలిపారు. పౌర స్వేచ్ఛపై పెగాసస్ తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెగాసస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం విపక్ష నాయకులు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థలోని ప్రముఖుల ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఇది భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రకంపనలు సృష్టించిందని సిబాల్ తెలిపారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై "వచ్చే వారం వింటాం" అని సీజేఐ రమణ స్పందించారు.