ప్రపంచంలోని అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించనుంది. ఈ మేరకు రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్ఐడిఎఫ్) ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ నుంచే భారత్ లో సీరమ్ ఈ ఉత్పత్తి ప్రారంభించనుంది. ఏటా 300 మిలియన్ల వ్యాక్సిన్లు తయారు చేయనున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ఇప్పటికే సాంకేతికత బదిలీ ప్రారంభం అయిందని తెలిపారు.
భారత్ లో సీరమ్ సంస్థ స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీకి దేశంలోని నియంత్రణా సంస్థ అయిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే సీరమ్ దేశంలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ సంస్థలు సంయుక్తంగా డెవలప్ చేసిన కోవిషీల్డ్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో దేశంలో అత్యధిక వ్యాక్సిన్లు ఈ సంస్థ నుంచే అందుబాటులోకి రానున్నాయి.