వ్యాక్సిన్ రేటు తగ్గింపు ట్వీట్ లో వివాదస్పద వ్యాఖ్యలు
ధర నిర్ధారణకు శాస్త్రీయ విధానం ఉందా?
నియంత్రణా సంస్థ ఎందుకు పెట్టరు?
నిపుణుల కమిటీ ధర ఎందుకు నిర్ణయించదు
వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో కేంద్రం 'బేరాలే' ఓ విచిత్రం. ఎవరికి తోచినట్లు వారు ధరలు నిర్ణయించేశారు. ఆ ధరలు కూడా ప్రపంచంలో అమ్మే ధరల కంటే చాలా ఎక్కవ. కేంద్రం దేశంలోని వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో అనధికారికంగా బేరాలకు దిగింది. రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ రేట్లను తగ్గించాలని కోరటం..దీనిపై స్పందించిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో స్పందిస్తూ ట్వీట్ చేయటం జరిగాయి. ఈ ట్వీట్ లో అదర్ పూనావాలా చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణంగానే ఉన్నాయని చెప్పొచ్చు. 'సీరమ్ ఇండియా ధాతృత్వపు చర్య'గా రాష్ట్రాలకు ఇచ్చే కోవిషీల్డ్ డోసు ధరను 400 రూపాయల నుంచి 300 రూపాయలకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సీరమ్ కేంద్రానికి మాత్రం 150 రూపాయలకే వ్యాక్సిన్ అందిస్తోంది. అదే సమయంలో రాష్ట్రాలకు మాత్రం 300 రూపాయలు అంటోంది. అయినా కూడా కేంద్రం, రాష్ట్రాల మధ్య ధరల విషయంలో ఇంత తేడా ఎందుకు?. అది కాకుండా అదేదో దాతృత్వపు చర్యగా పేర్కొనటం ఏ మాత్రం సరికాదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇది రాష్ట్రాలను..ప్రజలను అవమానించటమే అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇటీవల వరకూ కేంద్రమే వ్యాక్సిన్ ను కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తూ వచ్చింది. అయితే మే 1 నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు 50శాతం డోసులను కేంద్రానికి ఇచ్చి మిగతా 50 శాతాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగా మార్కెట్‌లో అమ్ముకునేందుకు కేంద్రం వీలు కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఒక్కో డోస్ ధర తొలుత 400 రూపాయలుగా సీరమ్ సంస్థ ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే ఒక్కో డోస్ ధర రూ.600గా నిర్ణయించింది. రాష్ట్రాలకు ఖర్చు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ అదర్ వూనావాలా తన ట్వీట్ లో పేర్కొన్నారు.