క్రూయిజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీ దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ పార్టీలో పలువురు సెలబ్రిటీల కుమారులు ఉండటంతో దీనిపై మీడియా మరింత ఎక్కువ ఫోకస్ పెట్టింది. సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్ సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ నిర్వాహకులతో పాటు పార్టీలో పాల్గొన్న పలువురు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఎనిమిది గంటల పాటు విచారించిన అనంతరం షారుఖ్ తనయుడు అర్యన్ తోపాటు మరికొంత మందిని అరెస్ట్ చేసినట్లు ఆదివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.
షారుక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఉన్న లింకులపై ఎన్ సీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఆర్యన్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అతడి కాల్స్ డేటాను, చాట్స్‌ను పరిశీలిస్తున్నారు. గోవాలో తీగలాగితే ముంబయ్ లో డ్రగ్స్ రాకెట్ డొంక కదలింది. సముద్రం మధ్యలో ఓ భారీ క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఎన్సీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి అండర్ కవర్ దాడులు నిర్వహించింది. ఈ డ్రగ్స్ పార్టీ సూత్రధారి ఎఫ్‌టీవీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఖాషిఫ్ ఖాన్ అని తెలుస్తోంది. అతడిని కూడా ఎన్ సీబీ అధికారులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు సమాచారంతో ఎన్ సీబీ అధికారులు కూడా సాధారణ ప్రయాణికుల వలే నౌకలోకి ఎక్కారు. సముద్రం మధ్యలోకి వెళ్ళాక అసలు కథ మొదలవటంతో అధికారులు కూడా రంగంలోకి దిగి వీరిని అదుపులోకి తీసుకున్నారు.