భారత్ లోనే అందుబాటులోకి వ్యాక్సిన్

Update: 2020-12-07 04:56 GMT

అత్యవసర వినియోగానికి సీరమ్ దరఖాస్తు

దేశంలో మూడవ దశ ట్రయల్స్ నిర్వహించిన ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాల వ్యాక్సిన్ రెడీ అయింది. కోవిషీల్డ్ పేరుతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. అమెరికా కు చెందిన ఫైజర్ ఇదే తరహా దరఖాస్తు చేసిన తర్వాత సీరమ్ కూడా దరఖాస్తు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సీరమ్ వ్యాక్సిన్ ను భారత్ లో ట్రయల్స్ నిర్వహించారు. అదే ఫైజర్ వ్యాక్సిన్ మాత్రం నేరుగా దిగుమతి చేసుకుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరిన తొలి భారత సంస్థ సీరమ్ ఒక్కటే. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలగటంలేదని కంపెనీ వెల్లడించింది.

ఐసీఎంఆర్ తో కలసి సీరమ్ దేశంలోని పలు చోట్ల పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పై విదేశాల్లో కూడా పరీక్షలు సాగాయి. భారత్ లోనూ జరిగాయి. దీంతో దేశీయ పరిస్థితులకు ఇది అనుకూలంగా ఉంటుందా లేదా అనే అంశంపై మరింత స్పష్టత ఉంటుంది. మరో కీలక అంశం ఏమిటంటే సీరమ్ ఇన్ స్టిట్యూట్ డీసీజీఐ అనుమతితో ఇప్పటికే 40 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను రెడీ చేసింది. కోవిషీల్డ్ సమర్ధత శాతాన్ని వెల్లడించకపోయినా ఇతర వ్యాక్సిన్లకు ధీటుగా ఇందులోనూ ఫలితాలు వచ్చినట్లు కంపెనీ తన దరఖాస్తులో పేర్కొంది. కరోనా వ్యాప్తి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని వైద్య సిబ్బంది, ప్రజలను రక్షించేందుకు అత్యవసర అనుమతులు ఇవ్వాలని తన దరఖాస్తులో కోరినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

Tags:    

Similar News