ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ఇక నుంచి మేజర్ ద్యాన్ చంద్ ఖేల్ రత్నగా మారుస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అదే సమయంలో గుజరాత్ లోని మోతేరా స్టేడియం కు ఉన్నసర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును తీసేసి నరేంద్ర మోడీగా మార్చారు కొద్ది కాలం క్రితమే. అయితే ఇప్పుడు ఆ స్టేడియంకు పెట్టిన మోడీ పేరు కూడా తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. క్రీడా అవార్డులకు..క్రీడా ప్రాంగణాలకు వారి పేర్లు పెట్టడమే సరైందని..ఇదే క్రీడాకారుల్లో స్పూర్తిని నింపుతుందని అంటూ ఇప్పటివరకూ ఉన్న రాజకీయ నేతల పేర్లు తీసేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఈ ఒక్క విషయంలోనే కాకుండా అన్నింటి విషయంలోనూ ఇదే స్పూర్తిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. క్రికెటర్ ఇర్పాన్ పటాన్ ఈ అంశంపై ట్వీట్ చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో ఇలాంటి మార్పులు ఎన్నో చేయాలన్నారు పటాన్. ఢిల్లీలో గతంలో ఫిరోజా కోట్లా మైదానానికి ఉన్న పేరును తొలగించి జైట్లీ స్టేడియంగా పేరు మార్చిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. గుజరాత్ ప్రతిపక్ష నేత శంకర్ సింగ్ వాఘేలా ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఈ మార్పు చేసిన మీరే తిరిగి గుజరాత్ స్టేడియానికి సర్దార్ వల్లబాయ్ పటేల్ పేరు పెట్టాలన్నారు. ఓ వైపు అందరూ రాజీవ్ పేరును తీసేయటాన్ని స్వాగతిస్తూనే మోడీ పేరు కూడా మార్చాలని డిమాండ్స్ రావటంతో కేంద్రం ఇరకాటంలో పడినట్లు అయింది.