భారతీయ పర్యాటకులకు ఇప్పుడు మరో దేశం కూడా వీసా లేకుండానే నేరుగా ఎంట్రీ వెసులుబాటు కల్పించింది. ఆ దేశమే ఫిలిప్పీన్స్. పర్యాటక అవసరాలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తారు. అది కూడా 14 రోజులు మాత్రమే ఆ దేశంలో పర్యటించడానికి అవకాశం ఉంటుంది. ఇది పొడిగించుకోవటానికి కూడా వీలు ఉండదు. ఫిలిప్పీన్స్ లో కూడా ఇతర వీసా లేకుండా అనుమతించే దేశాల నిబంధనలే వర్తిస్తాయి. అవి ఏంటి అంటే ఇండియా నుంచి టూరిజం కోసం వెళ్లే వాళ్ళు అక్కడ కన్ఫర్మ్ అయిన హోటల్ బుకింగ్స్ తో పాటు రిటర్న్ జర్నీ ఫ్లైట్ టికెట్ ఆ దేశం లో ల్యాండ్ అయినప్పుడు చూపించాల్సి ఉంటుంది. అదే సమాయంలో ఫిలిప్పీన్స్ లో పర్యటించేందుకు అవసరమైన నిధులు ఉన్నట్లు బ్యాంకు స్టేట్మెంట్ లేదా ఉద్యోగం చేస్తుంటే ఆ వివరాలు చూపించాల్సి ఉంటుంది.
అమెరికా, యూకె, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో నివసించే భారతీయులు ఆయా దేశాలకు చెందిన చెల్లుబాటు అయ్యే వీసా లేదా పర్మినెంట్ రెసిడెన్సీ కలిగి ఉన్న వాళ్లకు మాత్రం ఫిలిప్పీన్స్ లో 30 రోజులు ఉండేలా వీసా మంజూరు చేస్తారు. ఢిల్లీ లోని ఫిలిప్పీన్స్ ఎంబసి ఈ వివరాలు వెల్లడించింది. ఫిలిప్పీన్స్ పర్యాటకులకు ఎంతగానే నచ్చుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఏకంగా సుమారు 7000 ద్వీపాలు ఉంటాయి. అంతే కాదు విస్తృతమైన అరణ్యాలు, అందమైన సముద్ర తీరాలు, విశిష్టమైన వన్యప్రాణులు, అగ్నిపర్వతాలతో ఈ దేశం ప్రసిద్ధి చెందింది.
ఈ ద్వీప దేశం పర్యాటకులకు ఎన్నో రకాల దృశ్యాలను, అనుభూతులను అందిస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. విస్మయాన్ని కలిగించే సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు కూడా ఇక్కడి ప్రత్యేకతలు. ఫిలిప్పీన్స్ లో చాక్లెట్ హిల్స్ (Chocolate Hills) ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం. సెంట్రల్ బోహోల్ లో ఉన్న చాక్లెట్ హిల్స్, దాని అందం, ప్రత్యేక భౌగోళిక నిర్మాణంతో ఫిలిప్పీన్స్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి అనే చెప్పాలి. సందర్శకులను మంత్రముగ్ధులను చేసే ఈ కొండలను “ఎనిమిదవ ప్రపంచ అద్భుతం” గా కూడా చెపుతారు. ఈ దేశం తైవాన్, వియత్నామ్, ఇండోనేసియా, మలేషియా, చైనాలతో సరిహద్దు పంచుకుంటుంది కానీ..అది నీటి తో అంటే...కేవలం మారిటైం బోర్డుర్లు మాత్రమే ఉంటాయి.