మార్కెట్ లపై ప్రతికూల ప్రభావం !

Update: 2024-10-05 08:25 GMT

Full Viewభారతీయ స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్న వేళ కీలక పరిణామం. పార్లమెంట్ కు చెందిన అత్యంత కీలక మైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ( పీఏసి ) సెబీ చీఫ్ మాదబీ పూరి బచ్ కు సమన్లు జారీచేసింది. ఇప్పటికే ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య సాగుతున్న పోరు కారణంగా ఈ శుక్రవారంతో ముగిసిన వారంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 2022 జూన్ తర్వాత ఇంతటి పతనం ఇదే మొదటిసారి. ఐదు ట్రేడింగ్ సెషన్ల లోనే ఇన్వెస్టర్ల సంపద దగ్గర దగ్గర పదహారు లక్షల కోట్ల రూపాయల మేర హరించుకుపోయింది. ఒక వైపు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, మరో ఎఫ్ఐఐ లు చైనా మార్కెట్ వైపు వెళుతుండటం కూడా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ తరుణంలో పార్లమెంటరీ పీఏసి సెబీ చీఫ్ సమన్లు జారీ చేయటం కీలకంగా మారింది. ఇది వచ్చే వారం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉంటుందా అన్న టెన్షన్ ఇన్వెస్టర్ల లో వ్యక్తం అవుతోంది.

                                       మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన సెబీ పని తీరుతో పాటు అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరుగుతుందా లేదా..హిండెన్ బర్గ్ ఆరోపణలు వంటి అంశాలపై పీఏసి మాదబీ పూరి బచ్ ను ప్రశ్నించే అవకాశం ఉంది అని సమాచారం. ప్రస్తుతం పీఏసి చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత కె సి వేణు గోపాల్ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కూడా సెబీ చీఫ్ మాదబీ పూరి బచ్ పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే సెబీ చీఫ్ ఈ విచారణకు హాజరు అవుతారా..లేక ఆమె తరపున అధికారులను పంపుతారా అన్న అంశంపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అధికార బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సెబీ పై ఎలాంటి ఆరోపణలు రాలేదు అని..వ్యక్తిగతంగా ఆమె పై ఆరోపణలు వచ్చాయని బీజేపీ చెపుతుండటం విశేషం. పీఏసి నోటీసు ల ప్రకారం సెబీ చీఫ్ అక్టోబర్ 24 న హాజరు కావాల్సి ఉంది.

Tags:    

Similar News