జమిలి ఎన్నికలు జరగాల్సిందే

Update: 2020-11-26 11:00 GMT

ఒక దేశం..ఒకే సారి ఎన్నికలు. ఇది జరిగి తీరాల్సిందేనని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. గత కొంత కాలంగా మోడీ సర్కారు ఈ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే దీనిపై అఖిలపక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశంలో నిత్యం ఎప్పుడూ ఏదో ఒక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని..ఇది దేశానికి మంచిది కాదన్నారు. దేశంలోని అన్ని ఎన్నికలకు ఒకటే ఓటర్ల జాబితా ఉండాలన్నారు. ఒక్కో ఎన్నికకు ఒక్కో జాబితా ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులపై ప్రతిసారి జరిగే ఈ ఎన్నికలు ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. అఖిలభారత ప్రిసైడింగ్ అధికారుల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ సమావేశంలో మాట్లాడారు.

అదే సమయంలో ఆయన 26/11 ముంబయ్ లో జరిగిన దాడుల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. జమిలి ఎన్నికలపై చర్చ జరగటమే కాదని..ఇది భారత్ కు ఎంతో అవసరం అని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీలు మంచి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి దేశం ముందు అన్న కోణంలో నిర్ణయాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సర్దార్ సరోవర్ డ్యామ్ పనులు పూర్తి చేయటంలో జరిగిన జాప్యాన్ని కూడా ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. రాజ్యాంగమే మనకు దారిచూపే వెలుగురేఖ అన్నారు. రాజ్యాంగంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

Tags:    

Similar News