వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై తోమ‌ర్ రివ‌ర్స్ గేర్

Update: 2021-12-26 09:49 GMT

వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలో కేంద్ర మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా దుమారం రేగింది. రాజ‌కీయ పార్టీల‌తోపాటు రైతు సంఘాలు కూడా మంత్రి వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డాయి. దీంతో తోమ‌ర్ చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న ఆదివారం నాడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల అంశంపై రివ‌ర్స్ గేర్ వేశారు. తాను చ‌ట్టాల‌ను మ‌ళ్లీ తెస్తామ‌ని చెప్ప‌లేద‌ని..రైతులను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తామ‌ని మాత్ర‌మే చెప్పిన‌ట్లు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. తొలుత తోమ‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాగు చట్టాల్ని వెనక్కి తీసుకున్నారని, ఈ ఎన్నికలు ముగియగానే మళ్లీ సాగు చట్టాల్ని తీసుకువస్తారని కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

నాగ‌పూర్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో తోమర్ మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశామని, భవిష్యత్తులో మళ్లీ ముందుకు వెళ్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాలను స్వల్ప మార్పులతో మళ్లీ తెస్తామని ప్రకటించారు. అయితే తన మాటలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని తోమర్ మండిపడ్డారు. ''వ్యవసాయ చట్టాలను మళ్లీ వెనక్కి తీసుకువస్తామని నేను చెప్పలేదు. రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం మంచి చట్టాలు చేసింది. కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గాం. అయితే రైతుల శ్రేయస్సు గురించి మా ప్రభుత్వం పని చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే రైతులే ఈ దేశానికి వెన్నెముక అని వ్యాఖ్యానించాను. అంతే కానీ సాగు చట్టాల్ని మళ్లీ తీసుకువస్తామని చెప్పలేదు'' అని తోమర్ స్ప‌ష్టం చేశారు.

Tags:    

Similar News