మోడీ సంచ‌ల‌నం..మూడు వ్య‌వ‌సాయ బిల్లులు వెన‌క్కి

Update: 2021-11-19 04:08 GMT

దేశ ప్ర‌జ‌ల‌ను క్షమాప‌ణ కోరుతున్నా

ప్ర‌ధాని మోడీ వెన‌క్కి త‌గ్గారు. ఇంత కాలం రైతుల మేలు కోస‌మే నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలు అంటూ వాదించిన ఆయ‌న ఈ మూడు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేవ‌లం కొంత మంది ద‌ళారులు మాత్ర‌మే వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్నార‌ని..వీటిపై వెన‌క్కి త‌గ్గేది లేదు అంటూ అటు పార్ల‌మెంట్ లోనూ..బ‌య‌టా వాదించిన బిజెపి అక‌స్మాత్తుగా ఈ అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. అంతే కాదు..దేశ ప్ర‌జ‌ల‌కు మోడీ క్షమాప‌ణ కూడా చెప్పారు. ఈ వ్య‌వ‌సాయ చట్టాల‌పై రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అయింది. అంతే కాదు..ఏడాదిపైగా వీటిని వ్య‌తిరేకిస్తూ రైతులు ఉద్య‌మాలు చేస్తున్నారు. రైతుల వ్య‌తిరేక‌త‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాల‌తోనే వెన‌క్కి త‌గ్గిన‌ట్లు భావిస్తున్నారు.

శుక్ర‌వారం ఉద‌యం జాతినుద్దేశించి మాట్లాడిన మోడీ ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కాంగ్రెస్ తో స‌హా ప‌లు రాజ‌కీయ పార్టీలు ఈ బిల్లులు వెన‌క్కి తీసుకోవాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి. అయినా స‌రే ముందుకు వెళ్ళ‌టానికే ఇంత కాలం బిజెపి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. ఇప్పుడు ఈ నెలాఖ‌రులోపు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని తెలిపింది. మ‌న‌స్పూర్తిగా ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర నుంచి కేంద్ర మంత్రులు అంద‌రూ ఇంత కాలం ఈ చ‌ట్టాలు రైతుల‌కు మేలు చేసేవి అంటూ వాదించిన విష‌యం తెలిసిందే. రైతు సంఘాలు..ఇత‌రులు మాత్రం ఇవి కార్పొరేట్ల‌కు అనుకూలంగా ఉన్నాయంటూ మండిప‌డుతున్నారు.ఈ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఉద్య‌మాలు చేసిన రైతులు చాలా మంది ప్రాణాలు కూడా విడిచారు.

Tags:    

Similar News