ఊహించని పరిణామం. విమానం ఓ వైపు కదులుతోంది. కానీ అంతలోనే ఓ వ్యక్తి కాక్ పిట్ లోకి ప్రవేశించాడు. అక్కడ నుంచి బయటపడే మార్గం కన్పించలేదు. మళ్ళీ లోపలికి వచ్చి అత్యవసర ద్వారం ఓపెన్ చేసి కిందకు దూకేశాడు. ఈ ఘటనతో విమానంలోని సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే ఆ విమానాన్ని రెండు గంటలు ఆపేశారు. అలా అర్ధాంతరంగా విమానం నుంచి కిందకు దూకిన వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ విషయం కాస్త ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది.
స్కై వెస్ట్ ఎయిర్ లైన్స్ నిర్వహించే యునైటెడ్ ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ 5365 లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ అసహజ ఘటనకు కారణమైన వ్యక్తికి చికిత్స అందించిన తర్వాత ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ ఏఏ) అదుపులో తీసుకుంది. ఈ విమానం లాస్ ఏంజెల్స్ విమానాశ్రయం నుంచి సాల్ట్ లేక్ సిటీకి వెళ్ళాల్సి ఉంది. అయితే ప్రయాణికుడు అలా వ్యవహరించటానికి కారణం ఏమై ఉంటుందా అన్న అంశంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బిఐ) విచారన చేస్తోంది.