ఒక్క ఏడాది. ఇంకా రెండు నెలల సమయం మిగిలే ఉంది. మధ్యలో కొన్ని రోజులు కరోనా ఆంక్షలతోనే పోయాయి. అయినా సరే మాల్దీవుల్లో ఇప్పటివరకూ ఏకంగా తొమ్మిది లక్షల మంది పర్యటించారు. కరోనా కష్టకాలంలోనూ మాల్దీవులు పర్యాటకుల ఫేవరేట్ డెస్టినేషన్ గా మారింది. ఈ ఏడాదిలో ఆ దేశాన్ని సందర్శించిన వారి సంఖ్యలో భారీ పెరుగుదల నమోదు అయింది. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో చాలా మంది పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ఇప్పటివరకూ 2021 సంవత్సరంలో మాల్దీవులను సంద్శించిన వారి సంఖ్య 905,000గా ఉన్నట్లు ఆ దేశ పర్యాటక శాఖ ప్రకటించింది. కోవిడ్ సమయంలోనూ పర్యాటకులకు ఇది అత్యంత సురక్షితమైన హాలిడే ప్రాంతంగా నిలిచింది. మాల్దీవుల పర్యాటక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2021లో పర్యాటకుల పెరుగుదల 122.5 శాతంగా నమోదు అయింది.
ఇందులో భారత్ నుంచి వెళ్లిన పర్యాటకులు 23 శాతంగా ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో రష్యా 19.4 శాతం, జర్మనీ 6.3 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఫ్రాన్స్, ఖజకిస్తాన్, స్పెయిన్, ఉక్రెయిన్, యూకె, యూస్ లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలోని ఇతర పర్యాటక దేశాలతో పోలిస్తే మాల్దీవులు అతి తక్కువ ఆంక్షలతో అనుమతించటం కూడా ఆ దేశానికి కలిసొచ్చింది. కరోనా తొలి దశలోనే దేశంలోని సెలబ్రిటీలు అందరూ మాల్దీవుల్లో వాలిపోయి అక్కడ సురక్షితంగా తలదాచుకున్నారు. దీంతో సంపన్నులు అందరూ ప్రత్యేక విమానాల్లో చలో మాల్దీవులు అంటూ ఎంజాయ్ చేశారు. కరోనా రెండవ దశ తర్వాత 2021 జులై నుంచి పర్యాటకులకు మాల్దీవులు తిరిగి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.