సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ వి రమణ ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్ నిబంధనల మధ్య జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, రమణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రమణ ప్రమాణ స్వీకారంతో ఆయన భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా నిలిచారు.
వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు జస్టిస్ రమణ ఆ పదవిలో కొనసాగనున్నారు. 55 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్ఠించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్.వి. రమణ నిలిచారు. గతంలో రాజమహేంద్రవరానికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.