
ఎవరి దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా ఇప్పుడు మొబైల్ ఫోన్ సర్వసాధారణం అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మొబైల్ మనుషుల నుంచి విడదీయలేని ఓ భాగంగా మారింది. మొబైల్ అంటే మామూలు కూడా కాదు..ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్ ఫోనే. ఇప్పుడు దేశమే మరింత స్మార్ట్ గా మారనుందట. తాజాగా దీనికి సంబంధించి ఆసక్తికరమైన నివేదిక ఒకటి వచ్చింది. 2026 నాటికి దేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకందార్ల సంఖ్య వంద కోట్లకు చేరనుందని దీని సారాంశం. ఇంటర్నెట్ ఆధారిత స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో గ్రామీణ ప్రాంతాలు కీలక పాత్ర పోషించనున్నాయి. 2021 నాటికే దేశంలో 120 కోట్ల మంది మొబైల్స్ వాడుతున్నారు. ఇందులో 750 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వచ్చే ఐదేళ్ళలో భారత్ రెండవ అతి పెద్ద స్మార్ట్ ఫోన్ల తయారీ దేశంగా కూడా అవతరించనున్నట్లు డెలాయిట్ స్టడీ వెల్లడించింది.
దేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకంలో వార్షిక వృద్ధి రేటు పట్టణ ప్రాంతాల్లో 2.5 శాతం ఉంటే..గ్రామీణ ప్రాంతాల్లో ఇది రాబోయే సంవత్సరాల్లో ఆరు శాతానికి చేరుతుందని ఓ అంచనా. ముఖ్యంగా ఫిన్ టెక్ సేవలు, ఈ హెల్త్, ఈ లెర్నింగ్ వంటి అంశాలు స్మార్ట్ ఫోన్ల అమ్మకాలకు ప్రధాన కారణం కానుందని లెక్కలేశారు. భారత్ నెట్ కార్యక్రమం కింద 2025 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్రం చర్యలుతీసుకుంటోంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న 5జీ సర్వీసులు కూడా స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కోవిడ్ కూడా దేశంలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలను పెంచిందనే చెప్పాలి. చాలా చోట్ల ఆన్ లైన్ క్లాస్ ల కారణంగా భారం అయినా సరే చాలా మంది తమ పిల్లలకు ఫోన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.