ఒక్క రోజులోనే నాలుగు లక్షలు దాటిన కరోనా కేసులు

Update: 2021-05-01 06:52 GMT

వైద్య రంగ నిపుణులు చెబుతున్నట్లే జరిగేలా కన్పిస్తోంది. మేలో దేశంలో కరోనా కేసులు కొత్త గరిష్టాలను నమోదు చేసే అవకాశం ఉంది. గత 24 గంటల్లోనే దేశంలో కరోనా కేసులు కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేశాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క రోజులోనే నాలుగు లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సెకండ్‌ వేవ్‌ కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తొలిసారిగా గడిచిన 24 గం‍టల్లో 4,01,993 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. శుక్రవారం నమోదైన కేసులతో కలుపుకొని మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,969కు పెరిగింది.

గడిచిన 24 గంటల్లో 3,523 మంది కోవిడ్‌తో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,11,853కు చేరింది. శుక్రవారం 2,99,988 మంది కరోనా బాధితులు కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 1,56,84,406 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,68,710కి చేరింది. దేశంలో కోవిడ్‌-19 రికవరీ రేటు 81.84గా ఉందని తెలిపారు. మే 15 నాటికి కరోనా కేసులు పీక్ కు చేరి..తర్వాత తగ్గుముఖం పడతాయనే అంచానాలు ఉన్నాయి.

Tags:    

Similar News