
కరోనా పోరులో భారత్ కీలకమైలురాయిని దాటేసింది. కరోనా నియంత్రణకు వ్యాక్సిన్లు అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందే. తొలుత విమర్శలు ఎన్ని వచ్చినా వ్యాక్సినేషన్ పక్కాగా జరిగిన చోట కొత్త కేసులు నమోదు అతి తక్కువగా ఉండటంతో వ్యాక్సిన్లు విజయం సాధించినట్లు స్పష్టం అవుతోంది. ఈ తరుణంలో వ్యాక్సినేషన్ లో భారత్ గురువారం నాడు కొత్త రికార్డు నమోదు చేసింది. దేశంలో ఇప్పటివరకూ వంద కోట్ల వ్యాక్సిన్లు వేశారు. ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సిన్ కార్యక్రమం నేటికి 100 కోట్ల డోసుల మైలు రాయికి చేరుకుని చరిత్ర సృష్టించింది. చైనా తర్వాత 100 కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ నిలిచింది. టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత తొలుత ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి.. ఏప్రిల్‌లో 45 ఏళ్లు పైబడిన వారికి.. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి టీకా వేయడం ప్రారంభించారు. తొలుత నెమ్మదిగా సాగినా వ్యాక్సిన్ కార్యక్రమం.. వైరస్ రెండో దశ విజృంభించిన తర్వాత శరవేగంగా ముందుకు సాగింది. ఇప్పుడు 100 కోట్ల డోసుల మార్క్‌ను దాటేసింది.ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు దేశాలు భారత్ కృషిని ప్రశంసిస్తున్నాయి. టీకా పంపిణీలో మైలు రాయిని దాటిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రామ్ మనోహర్‌లోహియా ఆస్పత్రిని సందర్శించి.. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ప్రజలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 'భారతదేశం చరిత్ర లిఖించింది. ఇండియా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, 130 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషి సాధించిన విజయాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం. 100 కోట్ల టీకాల మైలు రాయి దాటినందుకు భారతదేశానికి అభినందనలు. మా వైద్యులు, నర్సులతో పాటు ఈ విజయం సాధించడానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు'' అంటూ మోదీ ట్విట్ చేశారు. ఈ చారిత్రాత్మక మైలురాయి చేరుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియా ఓ పాటను విడుదల చేశారు. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ ఈ పాట పాడారు. ఈ సందర్భంగా 1,400 కిలోల బరువు, 225 అడుగుల పొడవు,150 అడుగులవెడల్పు కొలతలు కలిగిన అతిపెద్ద ఖాదీ త్రివర్ణ పతాకాన్ని ఎర్రకోటలో ప్రదర్శించనున్నారు. విచిత్రం ఏమిటంటే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద కోట్ల డోసులు దాటినా రెండు డోసులు పూర్తి చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.