మంత్రి హర్షవర్ధన్ తీరుపైనా ఐఎంఏ తీవ్ర అభ్యంతరం
పతంజలికి చెందిన కరోనిల్ వ్యవహారం మరోసారి వివాదస్పదం అయింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కేంద్ర ఆరోగ్య శాఖ తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ 19ను కరోనిల్ నిరోధించే అవకాశం ఉంటే కేంద్రం వ్యాక్సిన్ కోసం 35 వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నట్లు అని ప్రశ్నించింది. కరోనాకు ఇది మందు అంటూ పతంజలి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించింది. అసలు ఓ డ్రగ్ కరోనా రాకుండా ఆపటంతోపాటు..వైద్యానికి పనిచేయటం, వైరస్ సోకిన వారికి ఉపశమనం ఎలా ఇస్తుందని ఐఎంఏ ప్రశ్నించింది.
అంతే కాదు..ఆరోగ్య మంత్రి కరోనిల్ ను ప్రమోట్ చేయటంపై కూడా ఐఎంఏ వివరణ కోరింది. దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హర్షవర్ధన్ కరోనిల్ ను ప్రోత్సహించటాన్ని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించింది. కరోనిల్ తప్పుడు నివేదికలతో కూడిన అశాస్త్రీయ ఉత్పత్తి అని..దేశ ప్రజలకు ఈ ఉత్పత్తులను ప్రమోట్ చేయటం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారని ప్రశ్నించింది. ఇది ఏ మాత్రం సమర్ధనీయం కాదని పేర్కొంది.