తాజా ట్వీట్ తో మార్కెట్ వర్గాల్లో కలవరం

Update: 2024-08-10 09:04 GMT

త్వరలోనే భారతదేశంలో ఒక పెద్ద విషయం వెలుగులోకి రాబోతుంది. ఇది అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ శనివారం ఉదయం ఎక్స్ వేదికగా చేసిన ఒక ట్వీట్. 2023 జనవరి లో ఇదే హిండెన్ బర్గ్ రీసెర్చ్ దేశంలో దిగ్గజ గ్రూప్ గా ఎదిగిన అదానీ కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒక నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదిక వెలువడిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ లో ప్రకంపనలు తలెత్తాయి. ముఖ్యంగా అదానీ గ్రూప్ షేర్లు భారీ నష్టాలను చవి చూసిన విషయం తెలిసిందే. అయితే హిండెన్ బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. ఇది అంతా తమపై..దేశంపై జరుగుతున్న కుట్ర గా అభివర్ణించింది. హిండెన్ బర్గ్ తన నివేదికలో అదానీ గ్రూప్ తమ కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచింది అని...అదే సమయంలో లెక్కల్లో కూడా గోల్ మాల్ చేసినట్లు ఈ నివేదిక ఆరోపించింది. పలు దేశాల్లో షెల్ కంపెనీల ద్వారా అదానీ సంస్థల్లోకి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి అని కూడా హిండెన్ బర్గ్ తన నివేదికలో పేర్కొంది. అయితే ఈ విషయంపై కేంద్రంలోని మోడీ సర్కారు మౌనాన్ని ఆశ్రయించగా..కేసు సుప్రీం కోర్ట్ కు చేరింది. సుప్రీం ఆదేశాల మేరకు సెబీ ఈ వ్యవహారంపై విచారణ జరిపించింది. కేవలం తాను లాభాలు గడించటానికే ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ స్వార్ధపూరితంగా నివేదికను తమ క్లయింట్లకు అందించింది అని ఇటీవల సెబీ ఆరోపించింది.

                                                            మరో వైపు హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ పై నివేదిక బహిర్గతం చేయటం వెనక చైనా హస్తం ఉంది అని ఆరోపణలను కూడా ముందుకు తెచ్చారు. గత కొంత కాలంగా ..ముఖ్యంగా కేంద్రంలో మూడవ సారి మోడీ సర్కారు వచ్చిన తర్వాత మార్కెట్ లు మరింత జోరుగా దూసుకెళుతున్నాయి. మధ్యలో అప్పుడప్పుడు కరెక్షన్స్ వచ్చినా కూడా దేశీయ మార్కెట్ లు జోరు జపిస్తున్నాయి. ఈ తరుణంలో హిండెన్ బర్గ్ తాజాగా చేసిన ట్వీట్ ఇన్వెస్టర్లను ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది అనే చెప్పాలి. ఈ సంస్థ ఇప్పుడు ఏ గ్రూప్ కు సంబదించిన..ఏ కంపెనీ గుట్టు రట్టు చేస్తోందో అన్న టెన్షన్ మార్కెట్ వర్గాల్లో ఉంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు హిండెన్ బర్గ్ ట్వీట్ చేసినట్లు మరో పెద్ద నివేదికను భయపెడితే మాత్రం మార్కెట్ లు తీవ్రం స్పందించే అవకాశం ఉంది అనే భయం ఎక్కువ మందిలో ఉంది. అయితే హిండెన్ బర్గ్ తన తాజా నివేదికను బహిర్గతం చేసే వరకు ఈ టెన్షన్ తప్పదు అనే చెప్పాలి.

Tags:    

Similar News