హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అంతా తూచ్. ఇది స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తేల్చిన అంశం. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక గ్రూప్ అయిన అదానీ కి ఇప్పుడు సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. 2023 జనవరిలో తొలిసారి అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్ కంపెనీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అని...కొన్ని కంపెనీల షేర్ల ధరను కృత్రిమ విధానాల ద్వారా పెంచారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అప్పటిలో ఇది స్టాక్ మార్కెట్ తో పాటు దేశ కార్పొరేట్ రంగంలో కూడా పెద్ద ప్రకంపనలు రేపింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీ ఎత్తున పతనం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అదానీ ఫ్లాగ్ షిప్ కంపెనీ లు అదానీ ఎంటర్ ప్రైజెస్ తో పాటు అదానీ పవర్, అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ షేర్లు ఈ నివేదిక వచ్చిన సమయంలో భారీ గా నష్టపోయాయి. అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై సిట్ తో విచారణ జరిపించాలని కొంత మంది సుప్రీం కోర్ట్ ను కూడా ఆశ్రయించారు అప్పటిలో. అయితే సుప్రీం కోర్టు కూడా సెబీ విచారణ సరిపోతుంది అని..ఈ అంశంలో సిట్ విచారణ అవసరం లేదు అని గతంలోనే స్పష్టం చేసింది. ఇప్పుడు సెబీ హిండెన్ బర్గ్ రిపోర్ట్ నిరాధారం అని పేర్కొంది. అదే సమయంలో అదానీ గ్రూప్ కంపెనీలకు క్లీన్ చిట్ ఇచ్చింది. గౌతమ్ అదానీ తో పాటు రాజేష్ అదానీ లపై వచ్చిన ఆరోపణలను కూడా తోసిపుచ్చింది.
హిండెన్ బర్గ్ రిపోర్ట్ ప్రధానంగా ఇన్ సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్ తో పాటు పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తన నివేదికలో పేర్కొంది. ఈ ఆరోపణల్లో ఏదీ నిరూపణ కాలేదు అని...సెబీ నిబంధనలు ఏవి కూడా ఉల్లఘించినట్లు ఆధారాలు లేవు అన్నారు. అదే సమయంలో గ్రూప్ కంపెనీలు అన్యాయమైన వాణిజ్య పద్ధతులు ఏమీ అనుసరించలేదు అని సెబీ తేల్చింది. దీంతో అదానీ గ్రూప్ కు..లేదా కంపెనీలకు ఎలాంటి జరిమానా విధించాల్సిన అవసరం కూడా లేదు అన్నారు.ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే అదానీ గ్రూప్ కంపెనీలపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్ బర్గ్ ఈ ఏడాది ప్రారంభంలోనే తన కార్యకలాపాలకు స్వస్తిపలికింది. ఇప్పుడు ఈ నివేదికలోని అంశాలు కూడా అటకెక్కాయి. సెబీ నివేదికపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము మొదటి నుంచి హిండెన్ బర్గ్ రిపోర్ట్ నివేదిక తప్పు అని చెపుతున్నాం అని..ఇప్పుడు అదే నిజం అయింది అన్నారు.