చావునైనా భరిస్తా..ఆత్మగౌరవం వదులుకోను
తమ్ముడు ఒక్కసారిగా దెయ్యం ఎలా అయిండు?
మంత్రులుగా చూడకపోతేపోయే..మనుషులుగా చూడాలని కోరుకున్నా
ఈటెల బెదిరింపులకు లొంగడు
నా మొత్తం ఆస్తులపై సిట్టింగ్ జడ్జి విచారణకు రెడీ
భూకబ్జా ఆరోపణలపై తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రభుత్వ బెదిరింపులకు లొంగబోనని ప్రకటించారు. ఇన్ని సంవత్సరాలు మీతో కలసి సాగిన సహఛరుడిగా ఇదేనా మీరిచ్చే గౌరవం అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ను ప్రశ్నించారు. ఈటెల మాటలు ఆయన వ్యాఖ్యల్లోనే...'కెసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడు నామీద ఆరోపణలపై చర్చోపచర్చలు పెట్టారు. అసలు ఏ రైతు అయినా భూముల ఆక్రమించారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారా?. అధికారులు మీరు ఏది చెపితే అది రాసి ఇవ్వొచ్చు. నేను తప్పుచేసినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధం. పార్టీకి నష్టం చేకూర్చే ఏ పనీ చేయలేదు. సంబంధం లేని భూములను నాకు అంటగడుతున్నారు. అసలు నా పేరు ఎలా పెడతావు. జమునా హ్యాచరీస్ ఛైర్మన్ నా భార్య. నీ అధికారులకు వాయి వరసలు లేవు. నీకూ కూతురు. కొడుకు ఉన్నారు.
ఒక సారి చూసుకో. వందలాది మంది ఆఫీసర్లను పెట్టి భయానక పరిస్థితి కల్పించారు. పథకం ప్రకారమే నాపై కుట్ర. 66 ఎకరాల భూమి కబ్జా చేసినట్లు రిపోర్ట్ ఇచ్చారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించండి. నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారు.. పెద్ద పెద్ద కేసులు పెడతారని చర్చ జరుగుతోంది. పెట్టుకోండి. మీ శిష్యరికంలో ప్రజలను నమ్ముకున్నా. చట్టాన్ని నమ్ముకున్నా. కోర్టుకెళతాం. కోర్టు దోషిగా తేల్చితే శిక్ష వేసుకోవటానికి రెడీగా ఉన్నా. మీరు కూడా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. ఎన్ని కంపెనీల చేతిలో అసైన్ మెంట్ భూములు ఉన్నాయి. సర్పంచ్ మాట్లాడిన దాన్ని మార్చారు. నీ మనిషి పంపించి మార్పించారు.. ఇంత కంటే చాలు నీ సంగతి చెప్పటానికి. కనీసం నా వివరణ అడగలేదు. నా భార్య మహిళా పారిశ్రామివేత్త. ఓ మహిళా పారిశ్రామికవేత్తను వేధింపులకు గురి చేయటం నీకు తగునా?. ఇది మన సంప్రదాయమా?.. అణఛివేత చేస్తే చెల్లదు.
అణచివేతను తట్టుకునే శక్తి నాకు సమాజం ఇచ్చింది. నీ కేసులు..అరెస్ట్ లకు భయపడే వాడు కాదు ఈ ఈటెల. నయూం లాంటి హంతక ముఠా చంపటానికి ప్రయత్నించింది. రాజశేఖర్ రెడ్డి బలం..శక్తి ముందు నేను ఎంత. ఎంత మంది ఆయన్ను కలిశారు..ఎంత మంది వెళ్లారో మీ అందరికీ తెలుసు. నమస్తే తెలంగాణకు నా ఆరెకరాల స్థలం మీద లోన్ పెట్టి ఇచ్చా. తర్వాత అధికారంలోకి వచ్చాక స్థిరపడ్డాక దాన్ని విడిపించారు. ఆ పేపర్ దేవాలయాల భూమి కబ్జా పెట్టినట్లు రాస్తుంది. బయటకు ఎన్ని అయినా మాట్లాడొచ్చు..కానీ మనకు అత్మరాత్మ ఉంటుంది. దాన్ని మోసం చేయలేం. వ్యక్తులు ఉంటారు..పోతారు.వ్యవస్థ. ధర్మం ఎప్పటికి ఉంటాయి. కేసులకు ఈటెల లొంగడు. వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చా..మళ్ళీ ఆ స్థాయికి పోవటానికి రెడీ కానీ. నా ఆత్మకు అమ్ముకోవటానికి రెడీ గా లేదు. వేల కోట్ల రూపాయలు సంపాదించాడని దుష్ప్రచారం చేస్తున్నారు. చాలా సార్లు నా తమ్ముడు అని చెప్పినవుగా.
ఒక్కసారే తమ్ముడు దెయ్యం ఎలా అయిండు. ఇన్ని సంవత్సరాలు మీతో పాటు కలసి ప్రయాణిస్తే మాకు ఇచ్చే గౌరవం ఇదా?. మానవ సంబంధాలే శాశ్వతంగా ఉంటాయి. చాలా గొప్పయి. అమ్ముడు పోకుండా కొట్లాడింది నీకు గుర్తురావాలి కదా?. మొత్తం నా ఆస్తుల మీద సిట్టింగ్ జడ్జిడితో విచారణ జరిపించండి. ఇవాళ నేను ఒక్కడినే కావొచ్చు. నాతో ఎమ్మెల్యే, ఎంపీ ఉండకపోవచ్చు. తెలంగాణ ప్రజలు ఉన్నారు.. మంత్రులుగా చూడకపోతే పోయే...మనుషులుగా చూడమని కోరుకున్నా. మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఆత్మగౌరవం తో ఉన్నారనుకోవటం లేదు. కార్యకర్తలతో మాట్లాడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మీరు కక్ష్య కడితే ఎలా చేస్తారో నాకు తెలుసు. ప్రజాస్వామ్యమే మనల్ని కాపాడుతుంది. మనం దిష్టిబొమ్మలు తగలపెట్టాల్సిన అవసరం లేదు. చావునైనా భరిస్తా తప్ప..ఆత్మగౌరవాన్ని వదులుకోను. ' అంటూ వ్యాఖ్యానించారు.