ట్రంప్ వర్సెస్ ఎలాన్ మస్క్

Update: 2025-06-06 06:27 GMT

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రపంచానికే పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఆయన నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రకటన వస్తుందో ఎవరికీ అర్ధం కాకుండా అయిపొయింది పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో రెండవ సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య సుంకాల విషయంలో చేసిన ప్రకటనలు ప్రపంచ మార్కెట్లను కొద్ది రోజుల పాటు అల్లకల్లోలం చేశాయి. హడావుడిగా నిర్ణయాన్ని ప్రకటించటం ...తర్వాత వాయిదా వేసి చర్చలకు రెడీ అంటూ సంకేతాలు ఇవ్వటం. డోనాల్డ్ ట్రంప్ తీరు చూసి ఎలాంటి అమెరికా ఇప్పుడు ఇలా అయిపోయింది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ప్రపంచానికే తలనొప్పిగా మారిన డోనాల్డ్ ట్రంప్ కే ఇప్పుడు టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నులో ఒకరు అయిన ఎలాన్ మస్క్ పెద్ద తలనొప్పిగా మారారు.

                                       తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఎవరికీ తెలియని ట్రంప్ కు చెందిన కొన్ని రహస్యాలు ఎలాన్ మస్క్ బయటపెట్టే అవకాశం ఉంది అనే చర్చ తెరమీదకు వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో తన మద్దతు లేకుంటే డోనాల్డ్ ట్రంప్ తో పాటు రిపబ్లిక్ పార్టీ నేతలు ఓటమి పలు అయ్యేవారు అంటూ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిపై డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఎలాన్ మస్క్ లేకపోయినా తన గెలుపు ఆగేది కాదు అంటూ ఆయనకు కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం నుంచి ఎలాన్ మస్క్ సంస్థలకు అందుతున్న రాయితీలు, కాంట్రాక్టుల్లో భారీగా కోత వేయనున్నట్లు ప్రకటించారు. డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ల మధ్య వివాదం ముదరటంతో ఆ ప్రభావం అమెరికా మార్కెట్ లపై కూడా పడింది. ప్రధానంగా ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా షేర్లు కూడా భారీగా పతనం అయ్యాయి. ఈ దెబ్బకు ఒకేసారి ఎలాన్ మస్క్ సంపద 13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయిపోయింది. డోనాల్డ్ ట్రంప్ పై ఎలాన్ మస్క్ సంచలన బాంబు వేశారు. అది ఏంటి అంటే సెక్స్ స్కాం లో నిందితుడు అయిన జెఫ్రీ ఎప్ స్టైన్ తో డోనాల్డ్ ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయి అని ఆరోపించారు. అందుకే ఈ నివేదిక బయటకు రాకుండా అవుతున్నారు అని విమర్శించారు. అంతే కాదు ట్రంప్ ని అభిశంసించాలని మస్క్ కోరటం ఇప్పుడు కలకలం రేపుతోంది.

                                   మరో వైపు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమెరికా లో కొత్త పార్టీ పెట్టడం అవసరం ఎంత ఉందో చెప్పాలని ఒక పోల్ నిర్వహించారు. డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశంలో అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు ఎలాన్ మస్క్ కు డిపార్ట్మెంట్ అఫ్ గవర్నమెంట్ ఎఫిసియెన్సీ (డోజ్) బాధ్యతలు అప్పగించారు. డోజ్ సారధిగా మస్క్ తీసుకున్న నిర్ణయాలు నచ్చక ఆయన కంపెనీ టెస్లా కు వ్యతిరేకంగా అమెరికా లో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సాగిన సంగతి తెలిసిందే. దీంతో టెస్లా అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయి. తన మిత్రుడికి సపోర్ట్ గా నిలిచేందుకు వైట్ హౌస్ ఐదు టెస్లా కార్లు తెప్పించుకుని ఒక కార్ ను డోనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేసిన విషయం అప్పటిలో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ లోని అంశాలపై మస్క్ మండిపడుతున్నారు. ఇది అమెరికాను దివాళా తీయించుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుంకాల కారణంగా అమెరికా ఈ సంవత్సరం చివరి నాటికీ మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉంది అని కూడా మస్క్ అంచనా వేస్తుండటం విశేషం. రాబోయే రోజుల్లో వీళ్లిద్దరి మధ్య తలెత్తిన వివాదం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News