వ్యాక్సిన్ వస్తే తప్ప విమానయానం కోలుకోదా?!

Update: 2020-10-28 13:24 GMT

నవంబర్ 30 వరకూ అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం

కరోనా దెబ్బకు విమానయానం రంగం తీవ్ర సమస్యల్లో కూరుకుపోయింది. అసలు ఇది ఎప్పుడు కోలుకుంటుందో తెలియని పరిస్థితి. దేశీయ విమానయాన రంగం ఇఫ్పుడిప్పుడే గాడిన పడుతోంది. అయినా అంతర్జాతీయ విమాన సర్వీసులు మాత్రం ఇప్పట్లో ప్రారంభం అయ్యే సూచనలు కన్పించటం లేదు. పలు దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాలు చేసుకుని విమానాలు నడుపుతున్నా ఇది పరిమిత సంఖ్యలోనే ఉంది. బ్యాంకాక్, సింగపూర్ వంటి దేశాల్లో ప్రస్తుతం అతి తక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉన్నా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు పర్యాటకులను అనుమతించే విషయంలో ఆయా దేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం యూఏఈ, మాల్దీవులు, నేపాల్ వంటి దేశాలు మాత్రమే పర్యాటకులను అనుమతిస్తున్నాయి. అయితే భారత్ తాజాగా నవంబర్ 30 వరకూ అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులపై నిషేదాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీంతో కొత్త సంవత్సరం నాటికి అయినా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గి..వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తప్ప విమానయాన రంగం గాడిన పడటం కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మామూలుగానే కరోనా ముందు నాటి పరిస్థితులు రావటం రెండేళ్లు పడుతుందనే అంచనాలు ఉన్నాయి. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇది మరింత జాప్యం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతర్జాతీయ సర్వీసులపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటూ డీజీసీఏ యూరప్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుతుండటంపై ఆందోళనక వ్యక్తం చేసింది.

Tags:    

Similar News